మల్కాజిగిరి, మే 21: నేరేడ్మెట్లోని ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం ఆవరణలో మేడ్చల్- మల్కాజిగిరి కోర్టు భవనాలు నిర్మించనున్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నేరేడ్మెట్లోని హైదరాబాద్ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం (డైట్)లోని ఐదు ఎకరాల స్థలాన్ని జిల్లా కోర్టుల కోసం కేటాయించింది. భవనాల నిర్మాణం కోసం రూ.90 కోట్లు మంజూరు చేసింది. గతంలో ఎల్బీనగర్లో ఉన్న కొన్ని కోర్టు బెంచిలను మల్కాజిగిరి సర్కిల్లోని వాజ్‌పేయినగర్‌కు తరలించారు. ఇక్కడ కోర్టుల సంఖ్య పెరగడంతో కక్షిదారులతోపాటు న్యాయవాదులకు ఇబ్బందులు వచ్చాయి. ఇక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా హైకోర్టు న్యాయమూర్తితోపాటు అధికారులు పరిశీలించారు. అనంతరం కోర్టులను వాయుపురిలోని ప్రైవేటు భవనంలోకి తరలించారు. ప్రైవేటు భవనానికి నెలనెలా అద్దె చెల్లించడంతోపాటు వాహనాల పార్కింగ్‌కు కూడా ఇబ్బందులు వచ్చాయి. కాగా, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు స్వయంగా నేరేడ్మెట్లోని జిల్లా ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాన్ని పరిశీలించి, ఇక్కడ మిగులుగా ఉన్న స్థలాన్ని కోర్టులకు కేటాయించాలని ప్రభుత్వానికి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం పరిశీలించి ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించింది. కొత్త భవనాల నిర్మాణం కోసం రూ.90 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే మల్కాజిగిరి మండల తాసిల్దార్ వెంకటేశ్వర్లు స్థలానికి సంబంధించిన పనులను పూర్తి చేశారు. ఇటీవల డైట్ కాలేజీ స్థలాన్ని జిల్లా జడ్జి మధుసూదన రావు కూడా పరిశీలించారు.
డైట్ కాలేజీ ఇక్కడే ఉంటుంది..!
హైదరాబాద్ జిల్లా ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం ఇక్కడే ఉంటుందని అధికారులు తెలిపారు. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. నేరేడ్మెట్లోని డైట్ కాలేజీలో దాదాపు ఏడు ఎకరాల స్థలం ఉంది. ఉపాధ్యాయుల శిక్షణ కోసం రెండు ఎకరాల స్థలం వినియోగిస్తున్నారు. మిగతా స్థలం నిరుపయోగంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న డైట్ కాలేజీకి రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించారు. కొత్తగా భవనాలు కట్టడానికి ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తుందని అధికారులు చెబుతున్నారు.