సిటీబ్యూరో, జనవరి 8 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్ పరిధిలోని సీనియర్ సిటీజన్ల సంక్షేమమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. అన్ని సర్కిళ్లలో సీనియర్ సిటీజన్లకు సంబంధించి అసోసియేషన్లను ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే 2007 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 1,41,849 ఐడీ కార్డులను అందజేశారు. వీరి కోసం ప్రత్యేకంగా 104 చోట్ల డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేశారు. సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వ పథకాలు సకాలంలో చేర్చడంతో పాటు వారి ఆరోగ్యంపై దృష్టి సారించి ఇందుకు అనుగుణంగా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్య సహాయాన్ని అందిస్తున్నారు. పార్కులకు ఉచిత ప్రవేశం, ప్రయాణం, ఇతర రాయితీలను పొందేందుకు గుర్తింపు కార్డులను అందిస్తున్నారు. నిరుపేద వృద్ధులకు వాకింగ్ స్టిక్స్, వీల్‌చైర్స్, హ్యాండ్ స్టిక్స్ పంపిణీ చేస్తున్నారు.
ఈ ఏడాదిలో జీహెచ్ఎంసీ దివ్యాంగులకు ప్రత్యేకంగా వికలాంగు మదింపు శిబిరాలను నిర్వహించింది. 4477 మంది లబ్ధిదారులకు గుర్తించి 9291 మందికి ఉపకరణాలను ఉచితంగా పంపిణీ చేసింది. ఈ కృత్రిమ అవయవాల పంపిణీకి రూ. 3.88కోట్లను ఖర్చు చేసినట్లు జీహెచ్ఎంసీ యుసిడి విభాగం అధికారులు పేర్కొన్నారు.