సిటీబ్యూరో/ అబిడ్స్, సుల్తాన్‌బజార్, జూన్ 8: మృగశిర కార్తెను పురస్కరించుకొని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బత్తిని కుటుంబం అందించే చేప ప్రసాదం కోసం శనివారం జనం పోటెత్తారు. నగరం నలుమూలల నుంచే కాకుండా దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి ఆస్తమావ్యాధిగ్రస్తులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. జీహెచ్ఎంసీ, జలమండలి, ఆర్అండ్బీ, విద్యుత్, రెవెన్యూ, మత్స్య, అగ్నిమాపక, పోలీస్ శాఖలు, ఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 32 కౌంటర్ల ద్వారా చేప ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఇదిలా ఉంటే పలు స్వచ్ఛంద సంస్థలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఫలహారాలు అందించి మానవత్వాన్ని చాటుకున్నాయి.
ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మంత్రి పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మేయర్ విజయలక్ష్మి, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మత్స్య పారిశ్రామిక సమాఖ్య చైర్మన్ మెట్టు సాయికుమార్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్లతో కలిసి చేప ప్రసాదం పంపిణీని ప్రారంభించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, స్పీకర్ ప్రసాద్‌కుమార్, మేయర్ విజయలక్ష్మి చేప ప్రసాదాన్ని తీసుకున్నారు. కార్యక్రమంలో మత్స్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అధర్ సిన్హా, మత్స్య శాఖ కమిషనర్ గోపి, హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ కేశవ్ పాటిల్, మత్స్య శాఖ అదనపు డైరెక్టర్ శంకర్ రాథోడ్, జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు రాష్ర్టాల నుంచే కాకుండా ఢిల్లీ, హర్యానా, ఛత్తీస్గడ్, యూపీ, బీహార్, మహారాష్ట్ర తదితర రాష్ర్టాల నుంచి చేప ప్రసాదం కోసం జనం తరలివచ్చారు. రాత్రి వరకు దాదాపు అరవై వేల వరకు టోకెన్ల విక్రయాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు నగరంలోని వివిధ మార్గాల నుంచి ఎగ్జిబిషన్ మైదానానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. అలాగే నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. రెండు రోజుల పాటు చేప ప్రసాదం పంపిణీ ఉండటంతో ఎగ్జిబిషన్ మైదానం.. పరిసరాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ముఖ్యంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా షీటీమ్స్‌ను రంగంలోకి దించారు.
చేప ప్రసాదం పంపిణీలో అపశృతి చోటుచేసుకున్నది. చేప ప్రసాదం కోసం వచ్చిన నిజామాబాద్ జిల్లాకు చెందిన గొల్ల రాజన్న(60) గుండెపోటుతో చనిపోయారు. అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్, బేగంబజార్ ఇన్స్పెక్టర్ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గొల్ల రాజన్న చేప ప్రసాదంకోసం శుక్రవారం సాయంత్రం మనవడితో కలిసి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానానికి వచ్చారు. శనివారం ఉదయం ఆరున్నర గంటల సమయంలో చేప మందు ప్రసాదాన్ని స్వీకరించేందుకు క్యూలైన్లో నిలబడ్డారు. క్యూలైన్లలో ప్రజలు ఎక్కువగా ఉండటం, తీవ్ర అనారోగ్యంతో ఉన్న రాజన్నకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చి పడిపోయారు. గమనించిన స్థానిక పోలీసులు సీపీఆర్ చేసి.. కేర్ దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ రాజన్న మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
-మంత్రి పొన్నం ప్రభాకర్
మృగశిర కార్తె సందర్భంగా బత్తిని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో చేప మందు పంపిణీ 150 ఏండ్లుగా కొనసాగుతున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చేప ప్రసాదం పంపిణీని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ చాలా కాలంగా ప్రజలు ఎంతో విశ్వాసంతో చేప మందును స్వీకరిస్తున్నారన్నారు. వివిధ దేశాలు, దేశంలోని ఇతర రాష్ర్టాల నుంచి ప్రజలు చేప ప్రసాదం కోసం వస్తున్నట్లు చెప్పారు.
– ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్
ఆస్తమా వ్యాధి బాధపడుతున్న తాను 1998 నుంచి బత్తిని సోదరులు అందించే చేప ప్రసాదాన్ని స్వీకరిస్తున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ గౌడ్ పేర్కొన్నారు. చేప మందు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నారు. తనకు ఆస్తమా ఉండేదని ఈ చేప ప్రసాదం తీసుకున్న అనంతరం చాలా వరకు తగ్గిందని చెప్పారు.