మాదాపూర్, జూలై 24 : దళిత బంధు పథకం లబ్ధిదారులకు ఆయా రంగాల్లో మరిన్ని అవకాశాలను కల్పించడానికి ఎల్డీఎఫ్ ఇండియాతో డీఐసీసీఐ ఒప్పందం కుదుర్చుకున్నదని దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కో ఆర్డినేటర్ నారాయణ దాసరి అన్నారు. సోమవారం మాదాపూర్‌లోని హైటెక్స్‌లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు పథకం యొక్క ప్రయోజనాలతో పాటు మరిన్ని వ్యాపార అవకాశాలను కల్పించేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఐసీసీఐ కో ఆర్డినేటర్ నారాయణ దాసరి విచ్చేసి నెక్ట్స్ జనరేషన్ కన్వీనర్ అరుణ్ కుమార్, సమీర్, సంబీత్లతో పాటు హైటెక్స్ బిజినెస్ హెడ్ టీజీ శ్రీకాంత్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ … ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. మొదటి దశలో 32 వేల మంది దళితులు లబ్ధి పొందారని చెప్పారు. లబ్ధి పొందిన వారు రవాణా రంగంలో వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారన్నారు. పశుపోషణలో 2 వేలు, డెయిరీలో 18 వందల నుంచి 2 వేల వరకు, మేకల పెంపకంలో 15 వందల యూనిట్లు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. డీఐసీసీఐ నెక్ట్స్ జనరేషన్ కన్వీనర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ… 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హుజూరాబాద్ మినహా రెండో దశలో 1.3 లక్షల కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని వర్తింపజేయాలని ఈ ఏడాది మార్చిలో మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలిపారు. ఎల్డీఎఫ్ మద్దతుతో దళిత బంధు లబ్ధిదారులకు ఆయా రంగాల్లో వ్యాపార అవకాశాలు, పూర్తి అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 16న దళిత బంధు ఉత్సవాలు నిర్వహించాలని మంత్రి వర్గం నిర్ణయించిందని వెల్లడించారు. సెప్టెంబర్ 21 నుంచి 23 వరకు లైవ్‌స్టాక్ డైరీ, ఫిషరీస్ ఎక్స్ పో జరగనున్న నేపథ్యంలో అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.