Shikha Goel | గోల్నాక, నవంబర్ 21: విధి నిర్వహణలో పోలీసు పవర్‌ను ప్రజల సేవకు వినియోగించాలని రాష్ట్ర సీఐడీ విభాగం డీజీపీ షికా గోయల్ అన్నారు. హైదరాబాద్ అంబర్‌పేట పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో గురువారం శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్ పాసింగ్ఔ ట్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి షికా గోయల్ ముఖ్య అతిథిగా హాజరై, జనవరి నెల 2024 సంవత్సరంలో శిక్షణ పొందిన మొత్తం 768 పోలీసు కానిస్టేబుల్స్ నుంచి ఆమె దీక్షాంత్ కవాతు గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పోలీసులు తమ పవర్‌ను వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించుకోకుండా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అందించాలన్నారు. శాంతి భద్రతల నిర్వహణలో కొత్త పోలీసులు భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. అంబర్‌పేట పోలీస్ శిక్షణ కేంద్రం ప్రిన్స్‌పాల్ పి.మధుకర్ స్వామి మాట్లాడుతూ, శాంతి భద్రతలు మరింత పెంపొందించే చర్యల్లో భాగంగా తెలంగాణ పోలీస్ అమలు చేస్తున్న నూతన సంస్కరణలతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కూడా శిక్షణ ఇచ్చామని తెలిపారు.
మొత్తం 768 మంది కానిస్టేబుల్స్ పాసింగ్ కాగా, ఇందులో వరంగల్ జిల్లా, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. ఇందులో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 91 మంది, గ్రాడ్యుయేట్స్ 609 మంది ఉండటం గమనార్హం. ఈ కార్యక్రమంలో పీటీసీ వైస్ ప్రిన్సిపాల్ పిచ్చయ్య, అడ్మిన్ డీఎస్పీలు మదన్ మోహన్, విజయ్ కుమార్, ఏవో జి.రాములు పాల్గొన్నారు.