సిటీబ్యూరో, జులై 19 (నమస్తే తెలంగాణ): సాంకేతిక వనరులను ఉపయోగిస్తూ విజుబులిటీ పోలీసింగ్‌తో ప్రజలతో మమేకమవుతూ ఉత్తమ సేవలందించాలని హైదరాబాద్ పోలీసులకు డీజీపీ జితేందర్ సూచించారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఆడిటోరియంలో నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి డీజీపీ హాజరై మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా పోలీసింగ్‌లో మార్పు వచ్చిందని, స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉత్తమ పద్ధతులను గ్రహిస్తూ ప్రత్యేకతను కల్గి ఉండాలన్నారు. హైదరాబాద్ గ్లోబల్, కాస్మో పాలిటన్ నగర మానవ వనరులు, టెక్నాలజీ, భారీగా పెట్టుబడులతో ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి జరగడం, అత్యంత నివాస యోగ్యమైన నగరంగా గుర్తింపు తెచ్చుకుందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నగదు రహిత ట్రాఫిక్ చలాన్ విధానాన్ని అమలులోకి తెచ్చిన సందర్భంగా ఎదురైన సవాళ్లను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. సున్నితమైన విషయంలో మాట్లాడే సమయంలో ఎవరికి ఇబ్బంది లేకుండా మాట్లాడాలని, పౌరులతో సరిగా ప్రవర్తించాలని సూచించారు. ఫిర్యాదుదారులను తిప్పి పంపకూడదని వారి సమస్యను తెలుసుకోవాలన్నారు. నేరాలను అదుపు చేయాలని, సాంకేతిక పరమైన శిక్షణ తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ఎన్ఫోర్స్మెంట్, సిగ్నల్స్ వినియోగం సాంకేతిక అంశాలపై దృష్టి పెట్టాలని, ట్రాఫిక్ విభాగం చేసే పనులను పౌరులతో పంచుకోవాలని సూచించారు.
వీఐపీ సంస్కృతిని అరికట్టడంతో పాటు సోషల్‌మీడియాను హ్యాండిల్ చేసేందుకు మంచి టీమ్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని డీజీపీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీలు విక్రమ్‌సింగ్ మాన్, విశ్వప్రసాద్, జాయింట్ సీపీ పరిమళ హననూతన్తో పాటు డీసీపీలు, ఏసీపీలు పాల్గొన్నారు.