వెంగళరావునగర్, సెప్టెంబర్ 4: పోలీస్ శాఖలో ఉత్తమ సేవలందించిన ఐపీఎస్ అధికారి చదలవాడ ఉమేశ్ చంద్ర సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర డీజీపీ డా.జితేందర్ అన్నారు. దివంగత ఉమేశ్ చంద్ర వర్ధంతిని బుధవారం ఎస్ఆర్ నగర్ కూడలిలో ఉన్న ఆయన విగ్రహం వద్ద నిర్వహించారు.
ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి డీజీపీ డా.జితేందర్ హాజరయ్యారు. ఉమేశ్ చంద్ర విగ్రహానికి డీజీపీ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తూ, తోటి సిబ్బంది కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ఉమేశ్ చంద్ర పోలీసు వృత్తికి వన్నెతెచ్చారన్నారు. వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించి శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల రక్షణ కోసం పనిచేసిన ఘనత ఆయన సొంతమన్నారు.
విధి నిర్వహణలో ఆయన అసువులు బాసినా.. పోలీసులు, ప్రజల గుండెల్లో సజీవంగానే ఉంటారన్నారు. డీజీపీతో పాటు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అదనపు డీజీ అనిల్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ గౌతం సవాంగ్, పశ్చిమ మండలం డీసీపీ విజయ్‌కుమార్, ఏసీపీ వెంకటరమణ, ఉమేశ్‌చంద్ర తండ్రి వేణుగోపాలరావు, తల్లి నయనతార, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సైదులు తదితరులు ఉమేశ్ చంద్ర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.