సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మన బస్తీ- మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి దృష్టి సారించారు. ఇందులో భాగంగా మొదలు పెట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జిల్లా అధికారులను ఆదేశించారు. శనివారం అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్న ముస్తాయిద్ పుర బాలుర ఉన్నత పాఠశాల, నాంపల్లి, బజార్‌ఘాట్ ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని, ఇంజినీరింగ్, విద్యాశాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. స్కూళ్లను అందంగా ముస్తాబు చేయడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీని వల్ల పాఠశాలల్లో ప్రవేశాలు పెరగడానికి అవకాశం ఉంటుందన్నారు.
జియాగూడ ఉప్పర్ బస్తీలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. అంగన్వాడీలోని పిల్లలు, సిబ్బందితో మాట్లాడి ఎలాంటి ఆహారం అందిస్తున్నారని తెలుసుకున్నారు. అక్కడ నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్ర నిర్వహణపై జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో రోహిణి, ఇంజినీరింగ్ అధికారులు, డిప్యూటీవోలు, డిప్యూటీ ఇన్స్పెక్టర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.