బడంగ్‌పేట, ఏప్రిల్ 18: రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.29.50 కోట్లతో చేపట్టిన మామిడిపల్లి గ్రామం నుంచి శంషాబాద్‌కు వెళ్లే నాలుగు లేన్ల రోడ్ల రహదారి విస్తరణ పనులకు మంత్రి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రం వచ్చిన తర్వాత ఔటర్ రింగ్‌రోడ్డు లోపల ఉన్న రోడ్లను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కోట్ల రూపాయాలు కేటాయిస్తున్నారని తెలిపారు. మందమల్లమ్మ చౌరస్తా నుంచి బాలాపూర్ మీదుగా ఏయిర్పోర్టు వెళ్లే రహదారి గతంలో చాలా ఇరుకుగా ఉండేదన్నారు.
మామిడిపల్లి నుంచి శంషాబాద్ ఏయిర్పోర్ట్ వరకు రోడ్డు అభివృద్ధి చేయడానికి కోట్ల నిధులు కేటాయించారని చెప్పారు. కందుకూరులో పార్మాసిటీ ఏర్పాటు చేయడం వల్ల మహేశ్వరం, తుక్కుగూడ ప్రాంతంలో కొత్తగా 52 కంపెనీలు వస్తున్నాయన్నారు. లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమవంలో బడంగ్‌పేట మేయర్ పారిజాత నర్సింహా రెడ్డి, నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు నరేందర్‌గౌడ్, కార్పొరేటర్లు శివకుమార్, వపన్‌కుమార్ యాదవ్, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.