కేపీహెచ్‌బీ కాలనీ, మే 8 : నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలన్నింటినీ పార్కులుగా, క్రీడా ప్రాంగణాలుగా తీర్చిదిద్దామని.. మరో రూ.17 కోట్లతో 58 పార్కులను ఆహ్లాదకరంగా అభివృద్ధి చేయనున్నట్ల్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం కేపీహెచ్‌బీ కాలనీ కార్పొరేటర్ క్యాంపు కార్యాలయంలో కేపీహెచ్‌బీ కాలనీ, బాలాజీనగర్, అల్లాపూర్, కూకట్పల్లి డివిజన్లను చెందిన అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నాలుగు డివిజన్ల పరిధిలోని 58 పార్కులలో మౌలిక వసతులు కల్పించే దిశగా అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. పార్కుల చుట్టూరా ప్రహరీ, లోపల పచ్చని మొక్కలతో గ్రీనరీలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పార్కులో విద్యుత్ దీపాలు, సీసీ కెమెరాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అభివృద్ధి చేసిన పార్కులకు మహనీయుల పేర్లు పెట్టాలని, స్థానిక ప్రజలు, అధికారులు, కార్పొరేటర్లు కలిసి పార్కుల పేర్లను నిర్ణయించాలన్నారు. ఇప్పటికే అభివృద్ధి పనులను పూర్తైన పార్కులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. మలేషియన్ టౌన్షిప్ పక్కన క్రికెట్ గ్రౌండ్, కేపీహెచ్‌బీ కాలనీ మొదటి రోడ్డులోని అల్లూరి పార్కు, కాలనీ 9వ ఫేజ్‌లోని 2.5 ఎకరాల స్థలానికి ప్రహరీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్‌లో త్వరలోనే వంద పడకల వైద్యశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
ఉపయోగపడేలా..
కూకట్పల్లి నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన మోడల్ మార్కెట్లు, మన కూరగాయల కేంద్రాలు నిరుపయోగంగా ఉన్నాయని, వాటిని ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని అధికారులను కోరారు. మోడల్ మార్కెట్లు, మన కూరగాయల కేంద్రాలను స్వాధీనం చేసుకుని స్థానిక వెల్ఫేర్ అసోసియేషన్ నేతలకు అప్పగించాలన్నారు. అలాగే కేపీహెచ్‌బీ కాలనీ 4వ ఫేజ్‌లోని మల్టీ పర్పస్ ఫంక్షన్‌హాల్‌ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఫంక్షన్హాల్లో పెండ్లిల కోసం కిరాయి(అద్దె)ని కేవలం రూ. 10వేలుగా నిర్ణయించాలన్నారు. ముఖ్యంగా కేపీహెచ్‌బీ కాలనీలో ప్రైవేట్ హాస్టళ్లపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, హాస్టళ్ల ఏర్పాటు, అందులోని వసతులపై ప్రత్యేక తనిఖీలు చేయాలన్నారు.
వీధి దీపాలన్నీ వెలగాలి..
కూకట్పల్లి, మూపాపేట సర్కిళ్ల పరిధిలో వీధి దీపాల వ్యవస్థ నిర్వహణ సక్రమంగా లేదని.. 80 శాతం కూడా విద్యుత్ దీపాలు వెలుగడం లేదని.. ఈ సమస్యను వెంటనే పరిష్కరించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కాలనీలు, బస్తీలలో రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించే పనులను వేగవంతం చేయాలన్నారు. కైత్లాపూర్ నుంచి సైబర్‌సిటీ మధ్యలో రోడ్డు విస్తరణ కోసం విద్యుత్ స్తంభాలను తొలగించే పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇరువైపులా రోడ్డును విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో మరో 20 ఓపెన్ జిమ్‌లు అందుబాటులోకి వస్తాయని, ప్రజలకు అందుబాటులో ఉండేలా స్థలాలను గుర్తించాలన్నారు
ఆగస్టులోగా పనులు పూర్తి కావాల్పిందే..
కాలనీలు, బస్తీలలో చేపట్టిన పనులన్నీ ఆగస్టులోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. ఇప్పటికే చేపట్టిన రోడ్లు, డ్రైనేజీ, పార్కులు, క్రీడాప్రాంగణాలు, తాగునీటి పైప్‌లైన్ పనులు, నాలాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. ఇంకా సమస్యలుంటే కాలనీలు, బస్తీల వారీగా ప్రణాళికలు రూపొందించాలని.. నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గోపాల్‌నగర్ నుంచి ముళ్లకత్వ చెరువు వరకు రూ.12.5కోట్లతో సీవరేజీ పైప్‌లైన్ పనులను త్వరగా ప్రారంభించాలన్నారు. అలాగే ముళ్లకత్వ చెరువు నుంచి కాముని చెరువు వరకు వర్షంనీటి కాలువను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అలాగే కేపీహెచ్‌బీ కాలనీ 3వ ఫేజ్, ఫతేనగర్, బాలాజీనగర్ డివిజన్లో రజకుల కోసం మోడల్ దోభీఘాట్లు ఏర్పాటు చేసే పనులను చేపట్టలన్నారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ ప్రణాళికాబద్ధంగా పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావు, జూపల్లి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్లు పగుడాల బాబురావు, తూము శ్రావన్‌కుమార్, జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు పాల్గొన్నారు.