సికింద్రాబాద్, జూన్ 30 : అర్హులైన ప్రతి ఒక్కరికీ రెండు పడకల గదుల ఇండ్లను కేటాయిస్తామని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో రెండు పడకల గదుల ఇండ్ల పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో స్థలాల కొరత ఉన్నప్పటికీ నాలుగు ప్రదేశాల్లో వాటి నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. సుభాష్ చంద్రబోస్నగర్, చిలకలగూడ ధోబీఘాట్ ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణ పనులు పూర్తైన కారణంగా వెంటనే ప్రారంభోత్సవాన్ని చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో వసంతకుమారి, తాసీల్దార్లు జానకీ, సునీల్, హౌసింగ్ ఈఈ వెంకట దాస్రెడ్డి, కార్పొరేటర్ హేమ, డీఈఈ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.