ఉస్మానియా యూనివర్సిటీ : పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యతని నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారానే దోమలను అరికట్టవచ్చని చెప్పారు. నేషనల్ డెంగ్యూ డే సందర్భంగా తార్నాక డివిజన్లోని పలు కాలనీలలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. డెంగ్యూ అవగాహన కరపత్రాలను ఆవిష్కరించి, పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డెంగ్యూ లాంటి వ్యాధులను నివారించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవడం ఎంతో ముఖ్యమని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని దోమల ఉత్పత్తిని నియంత్రించడంలో ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతను నెరవేర్చాలని కోరారు. ప్రజల్లో పారిశుద్ధ్యంపై మరింత అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. ప్రతి ఇంటిలో పరిశుభ్రత పాటించడం, నిల్వ నీటిని తొలగించడం, నీటి ట్యాంకులను మూసి ఉంచడం, వాడిన ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను సక్రమంగా తొలగించడం వంటి చర్యలు పాటించాలని కోరారు.
ప్రభుత్వ సంస్థలు, కాలనీ సంక్షేమ సంఘాలు, విద్యాసంస్థలు, పౌరుల మధ్య సమన్వయం ఉంటేనే డెంగ్యూ వంటి వ్యాధులను పూర్తిగా నియంత్రించగలమన్నారు. ఈ కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి, జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం అధికారులు దుర్గాప్రసాద్, రాజశేఖర్, ప్రదీప్, నర్సింగ్, జుబేర్, జాఫర్, ఫరూక్, మహమ్మద్, అశోక్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.