సిటీబ్యూరో, జూలై 19(నమస్తే తెలంగాణ) : దేశానికి రక్షణగా నిలిచే జవాన్లకు తెలంగాణలో పండే చిరుధాన్యాలతో కూడిన ఆహారాన్ని అందించనున్నారు. తెలంగాణతోపాటు దేశంలోని యూపీ, కర్ణాటక, హర్యానా వంటి రాష్ర్టాల్లో సాగు చేసిన క్వాలిటీ మిల్లెట్ల ఆహారం ఇవ్వనున్నారు. దీనికి రాజేంద్రనగర్‌లోని మిల్లెట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ను ఆశ్రయించగా.. అన్ని రకాల శ్రీ అన్నాన్ని అందించేందుకు అంగీకరించింది. ఈ మేరకు ఇరు సంస్థల చర్చలు సాగుతున్నాయి. దేశంలో చిరుధాన్యాలను సాగు చేసే రాష్ర్టాల నుంచి వీటిని అందించనున్నాయి. దేశంలోని రక్షణ బలగాలకు పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో రక్షణ, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖల మధ్య కీలక ఒప్పందం కుదిరింది.
ఈ ఒప్పందం ప్రకారం.. రక్షణ బలగాలకు చెందిన మెస్‌లలో చిరుధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచనున్నారు. అదేవిధంగా క్యాంటీన్లలోనూ చిరుధాన్యాలను విక్రయించేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు ఐసీఏఆర్‌కు చెందిన పరిశోధన సంస్థలు సాయం అందించనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ వేదికగా మిల్లెట్ల సాగు, ఆహార పదార్థాల తయారీపై పరిశోధనలు చేస్తున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ సంస్థ… చిరుధాన్యాలను అందించేలా సహకరించనున్నది.
రైతులను సమన్వయం చేస్తూ..
తెలంగాణలో సాగు చేస్తున్న చిరుధాన్యాల ఉత్పత్తి, సాగు విస్తీర్ణం పెంచడంలో ఐసీఏఆర్-ఐఐఎంఆర్ కీలక పాత్ర పోషిస్తున్నది. రైతులను సమన్వయం చేస్తూ జిల్లాల వారీగా మిల్లెట్ల ఉత్పత్తిని పెంచుతున్నది. కొనుగోలు సామర్థ్యాన్ని పెంచడం, చిరుధాన్యాల సాగుపై పర్యావరణ ప్రభావం లేకుండా, దిగుబడిని పెంచడంలో ఐఐఎంఆర్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా మిల్లెట్ల సాగును పెంచడానికి కృషి చేస్తుండటంతోపాటు నాణ్యత, ప్రాసెసింగ్, నిల్వ, బై ప్రొడక్టుల తయారీపై అవగాహన కల్పిస్తున్నది. ఈ కారణంగానే రక్షణ శాఖకు మిల్లెట్ల వినియోగంపై అవగాహన, సరఫరా చేయనున్నది. ప్రస్తుతం తెలంగాణలో అత్యధికంగా సంగారెడ్డి, మహబూబ్‌నగర్, జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలతోపాటు మరికొన్ని జిల్లాల్లో సాగులో ఉన్నది. అదేవిధంగా దేశంలో మిల్లెట్లు అధికంగా సాగు చేస్తున్న రాష్ర్టాల్లో దక్షిణాది ప్రాంతాలు ముందు వరుసలో ఉండగా, తెలంగాణతోపాటు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి మిల్లెట్లను సేకరించనున్నారు. దీంతోపాటు రాజస్థాన్, యూపీ, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అధికంగా సాగు చేసే జాబితాలో ఉండగా, రక్షణ శాఖ అవసరాలకు అనుగుణంగా ఐఐఎంఆర్ అందించనున్నది.