సిటీబ్యూరో, ఆగస్టు 27 (నమస్తేతెలంగాణ): డెంగీ నిర్ధారణ, చికిత్స కోసం తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. ప్రస్తుతం గ్రేటర్లో భారీగా కేసులు నమోదవుతున్న దృష్ట్యా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నది. డెంగీ చికిత్సకు కార్పొరేట్లో వేలు, లక్షల రూపాయలు వసూలు చేస్తుండటంతో నిరుపేద, మధ్య తరగతికి చెందిన ప్రజలపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు సర్కార్ అన్ని రకాల సేవలను ప్రభుత్వ దవాఖానల్లో అందించాలని నిర్ణయించింది.
ప్రస్తుతం కరోనా నేపథ్యంలో డెంగీ, కరోనా లక్షణాలు దాదాపు ఒకేలా ఉండగా రోగి ఆరోగ్య పరిస్థితి, ఇతర లక్షణాల ఆధారంగా ఏది డెంగీ, ఏదీ కరోనానో అంచనా వేయవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. లక్షణాల ఆధారంగా సంబంధిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నారు. అన్ని రకాల ప్రభుత్వ దవాఖానల్లో డెంగీ చికిత్స అందిస్తున్నారు. ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోయిన వారికి గాంధీ, ఉస్మానియా, నిమ్స్.. చిన్నపిల్లలైతే నిలోఫర్‌తో పాటు ఇతర వైద్యశాలలకు తరలిస్తున్నారు.
గ్రేటర్ పరిధిలోని 148 ఆరోగ్య కేంద్రాల్లో డెంగీ నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఉస్మానియా, గాంధీ, నల్లకుంట ఫీవర్‌హాస్పిటల్, నిమ్స్‌తో పాటు 130 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 12 ఏరియా వైద్యశాలలు, మూడు జిల్లా దవాఖానల్లో ఈ పరీక్షలు జరుపుతున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ఉస్మానియా, గాంధీ, ఫీవర్, నిమ్స్ వంటి ట్రెషరీ దవాఖానల్లో ఐజీజీ, ఐజీఎం, ఎన్ఎస్1, యాంటిజన్ తదితర పద్ధతుల్లో డెంగీ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.
డెంగీ రోగులకు ఉస్మానియాలో మెరుగైన చికిత్స అందిస్తున్నాం. ఈ మధ్యకాలంలో ప్రతిరోజు మూడు నుంచి నాలుగు కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం రికవరీ రేటు బాగానే ఉంది. గతంలో ఉన్న తీవ్రత ఇప్పుడు లేదు. రోగులకు వైద్యం అందిస్తున్నాం. ప్లేట్లెట్ కౌంట్ పడిపోతుంటే రోగి పరిస్థితి ఆధారంగా ప్లేట్లెట్స్ ఎక్కిస్తున్నాం. ఉస్మానియాలో బ్లడ్ కాంపోనెంట్స్ తయారు చేసే సౌకర్యం ఉంది. డెంగీ నిర్ధారణ పరీక్షలు సైతం ఇక్కడే నిర్వహిస్తున్నాం. డెంగీ రోగులకు ప్రత్యేక చికిత్స ఏమీ ఉండదు. సాధారణంగా సపోర్టింగ్ ట్రీట్మెంటే ఉంటుంది. అయితే ప్లేట్లెట్ కౌంటును పరిశీలిస్తూ.. పడిపోకుండా చూసుకోవాలి. జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు 60 కేసులు నమోదయ్యాయి.- డాక్టర్ నాగేందర్, ఉస్మానియా సూపరింటెండెంట్
ఫీవర్ వైద్యశాలలో డెంగీ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నాం. లక్షణాలు కనిపిస్తే వారికి సపోర్టింగ్ ట్రీట్మెంట్ అందిస్తున్నాం. ప్లేట్లెట్ కౌంట్ లక్ష లోపు పడిపోయినా రోగి ఆరోగ్యంగా ఉంటే ఇక్కడే వైద్యం అందిస్తున్నాం. కౌంట్ క్రమంగా పడిపోతే మాత్రం ఉస్మానియా, గాంధీలకు రెఫర్ చేస్తున్నాం.- డాక్టర్ జయలక్ష్మి, సీఎస్ ఆర్ఎంఓ, ఫీవర్ వైద్యశాల