సిటీబ్యూరో, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ)/మణికొండ : నగర శివారులోని మణికొండ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఇబ్రహీంబాగ్ చెరువు బఫర్ జోన్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ కొరడా ఝులిపించింది. బుధవారం ఇబ్రహీంబాగ్ చెరువు బఫర్ జోన్ సర్వే నంబర్లు 53, 54 పరిధిలో లేక్ వ్యూ విల్లాస్ పేరిట అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలపై హెచ్ఎండీఏ – మణికొండ మున్సిపల్ అధికారులు కలిసి జేసీబీ సహాయంతో ఆరు విల్లాలను నేలమట్టం చేశారు. పక్కా ప్రణాళికతో మణికొండ మున్సిపల్ కమిషనర్ ఫల్గున్ కుమార్, హెచ్ఎండీఏ ఎన్ఫోర్స్మెంట్ డి.ఎస్.పి (ఇన్చార్జి) వెంకటేశ్ నేతృత్వంలో ఇరిగేషన్ అధికారులు, నార్సింగి పోలీసుల సహకారంతో బుధవారం ఉదయం 8 గంటల నుంచి జాయింట్ ఆపరేషన్ ప్రారంభించి మధ్యాహ్నం వరకు కూల్చివేతల కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తామని హెచ్చరించారు. ఎక్కడ నిర్మాణాలు చేపట్టినా ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన తర్వాతే చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా నగరంలోని చెరువుల పరిరక్షణ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. చెరువుల ఎఫ్టీఎల్ పరిధిని గుర్తించి, బఫర్ జోన్లను మార్కింగ్ చేసి హెచ్ఎండీఏ వెబ్సైట్లో ఆయా చెరువుల వివరాలను పొందుపర్చిందని తెలిపారు.
చెరువులకు సంబంధించిన ఫైనల్ నోటిఫికేషన్లో అన్ని విషయాలు ఉంటాయని, వాటిని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నిర్మాణాలు చేపట్టాలన్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, గ్రేటర్ చుట్టూ ఉన్న చెరువులన్నింటినీ ప్రత్యేకంగా లేక్ ఐడీని హెచ్ఎండీఏ ఏర్పాటు చేసి ఆ వివరాలను వెబ్సైట్లో పొందుపర్చారని చెప్పారు. చెరువుల సమీపంలో ఇళ్లు నిర్మించే వారైనా, కొనుగోలు చేసే వారెవరైనా సరే ప్రభుత్వ నిబంధనలను పరిశీలించిన తర్వాత కొనుగోలు చేయాలని హెచ్ఎండీఏ అధికారులు సూచించారు.