సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): నిబంధనలకు విరుద్ధంగా డిఫెన్స్ మద్యం విక్రయాలకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని మల్కాజిగిరి ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.1.50లక్షల విలువ చేసే 50డిఫెన్స్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మలాజిగిరి ఎక్సైజ్ ఏఈఎస్ ముకుంద రెడ్డి కథనం ప్రకారం… కుషాయిగూడ ప్రాంతానికి చెందిన వీరస్వాములు (47) సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో గత కొంత కాలంగా డిఫెన్స్ మద్యాన్ని మార్కెట్లో అక్రమంగా విక్రయిస్తున్నాడు.
డిఫెన్స్ క్యాంటీన్లో మద్యం తీసుకునే వారితో పరిచయం ఏర్పరచుకొని, వారి వద్ద మద్యం బాటిళ్లను తకువ ధరలకు కొనుగోలు చేసి, మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ సమాచారం అందుకున్న మలాజిగిరి ఎక్సైజ్ ఏఈ ఎస్.ముకుంద రెడ్డి, సీఐ చంద్రశేఖర్, కుమారస్వామి, ఎస్ఐ సంధ్యారాణి బృందం ఈసీఐఎల్ రోడ్లోని వీరస్వామి ఇంటిపై దాడులు జరిపారు. ఈ దాడుల్లో రూ.1.50లక్షల విలువ చేసే 50 డిఫెన్స్ మద్యం బాటిళ్లతో పాటు ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును మల్కాజిగిరి ఆబ్కారీ పోలీసులకు అప్పగించారు.
నాంపల్లిలో గంజాయి పట్టివేత
నాంపల్లిలో అఫ్జల్నగర్ ప్రాంతానికి చెందిన సచిన్ ఉపాధ్యాయ గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నాడు. ఈ సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ పోలీసులు సచిన్ నివాసంపై దాడులు జరిపారు. ఈ దాడుల్లో నిందితుడి ఇంట్లో అర కిలో గంజాయి లభించింది. దీంతో సచిన్ ఉపాధ్యాయను అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును నాంపల్లి ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు.
ఉప్పల్లో….
ఉప్పల్ ప్రాంతంలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న భాగ్యవద్ అనే వ్యక్తిని రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 510 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును ఉప్పల్ ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు.
150కిలోల నల్ల బెల్లం పట్టివేత
ఎంజీబీఎస్ నుంచి ఆమన్గల్కు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో రవాణా చేస్తున్న నల్లబెల్లం, గుడంబా తయారీకి సంబంధించిన ఆలంను ఎస్టీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్టీఎఫ్ ఎస్ఐ బాలరాజ్ కథనం ప్రకారం…ఆమన్గల్ ప్రాంతానికి చెందిన ఎల్లమ్మ శుక్రవారం హైదరాబాద్ నుంచి అమన్గల్ ప్రాంతానికి వెళ్లే ఆర్టీసీ బస్సులో 150కిలోల నల్లబెల్లం, 20కిలోల ఆలంను రవాణా చేస్తోంది. ఈ మేరకు సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ పోలీసులు బస్సులో రావాణా చేస్తున్న బెల్లం, ఆలంను స్వాధీనం చేసుకుని, నిందితురాలిని అరెస్టు చేశారు.