సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ) : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చెత్త రవాణా నిధుల మళ్లింపు వ్యవహారంలో భారీ అవినీతి అక్రమాలు వెలుగుచూశాయి. నిజాంపేట్ ట్రాన్స్ పోర్ట్ స్టేషన్ నుంచి జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌కు చెత్తను తరలించే కాంట్రాక్టుకు సంబంధించిన చెల్లింపుల్లో తీవ్ర అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో సీఎంసీ కమిషనర్ సృజన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ కార్యాలయంలో ఎస్ఎన్డీపీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న బి.ధీరజ్ కుమార్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఏఈఈగా పనిచేస్తున్న కాలంలో ధీరజ్ కుమార్‌రెడ్డి అవినీతి, అక్రమాలపై పూర్తి వివరాలతో గత నెల 8న ‘దొంగ ఖాతాలు.. ఫోర్జరీ పత్రాలు’ శీర్షికన ‘నమసే’్తలో కథనం ప్రచురితమైంది. స్పందించిన సీఎంసీ కమిషనర్ విచారణకు ఆదేశించారు. అక్రమాలకు సంబంధించిన పూర్తి వివరాలను నివేదించాల్సిందిగా ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్, చీఫ్ ఇంజినీర్, అడిషనల్ కమిషనర్లతో పాటు డీఎస్పీని ఆదేశించడంతో సమగ్ర విచారణ చేపట్టిన అధికారులు..నివేదికను కమిషనర్‌కు సమర్పించారు. దీంతో బుధవారం డీఈఈ పనిచేసున్న ధీరజ్ కుమార్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు.
ఏఈఈగా ఉన్నప్పుడే చేతివాటం
గతంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ)గా ధీరజ్ కుమార్ రెడ్డి పనిచేసిన కాలంలో (ఆగస్టు 2023 నుంచి జనవరి 2025 వరకు) చెత్త రవాణా నిధులను మోసపూరితంగా దారి మళ్లించినట్లు కమిషనర్ తన ఉత్తర్వుల్లో పేరొన్నారు. ఈ వ్యవహారంలో ఆయన తీవ్రమైన వృత్తిపరమైన దుష్ప్రవర్తనకు, అవినీతికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1991 లోని రూల్ 8 (1) ప్రకారం ధీరజ్ కుమార్ రెడ్డిని తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు కమిషనర్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. పరిపాలనా ప్రయోజనాల దృష్ట్యా, నిష్పక్షపాత విచారణ కోసం ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. సస్పెన్షన్ కాలంలో కమిషనర్ ముందస్తు అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లరాదని, నిబంధనల ప్రకారం జీవనభృతి చెల్లించబడుతుందని ఆదేశించారు.
పెద్ద తలకాయల సంగతేంటో?
నిజాంపేట డంపింగ్ యార్డు రవాణా నిధుల దారి మళ్లింపులో ఏఈఈ ధీరజ్ కుమార్ రెడ్డి వేటు వేయడం మున్సిపల్ శాఖలో తీవ్ర కలకలం రేపుతోంది. తలా పాపం తిలా పిడికెడు అన్నట్టుగా సాగిన ఈ నిధుల దారి మళ్లింపులో ఇంజినీరింగ్, ఆర్థిక విభాగం, అప్పటి మున్సిపల్ కమిషనర్ల వరకు బాధ్యులుగా ఉన్నారు. ధీరజ్‌కుమార్ రెడ్డికి సంబంధించిన బినామీ ఏజెన్సీకి రూ.20 లక్షల చొప్పున నాలుగు దఫాలుగా చెక్కులు మంజూరయ్యాయి. అప్పటి కమిషనర్లు కూడా ఈ చెక్కులపై సంతకాలు చేశారు. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ఫాంలో టెండర్లో పేర్కొన్న కంపెనీకి పేమెంట్ చేస్తున్నట్లు పేర్కొంటే…ఆర్టీజీఎస్ మాత్రం బినామీ ఎజెన్సీ బ్యాంకు ఖాతాకు వెళ్లడం..ఇందులో అప్పటి కమిషనర్లు, సంబంధిత బ్యాంకు అధికారుల పాత్ర ఏమిటన్న చర్చ జరుగుతున్నది. ఈ అవినీతి, అక్రమాలపై మరింత లోతుగా విచారణ చేపట్టి బాధ్యులందరిపైనా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.