సిటీ బ్యూరో, జనవరి 25 (నమస్తే తెలంగాణ): జలమండలి చేపట్టిన పైప్ లైన్లు, మ్యాన్ హోళ్లను శుభ్రం చేసే డీ-సీల్టింగ్ పనులకు మరో 90 రోజుల గడువు పొడిగించినట్లు జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్ తెలిపారు. ఈమేరకు వ్యర్థాల తొలగింపు పనులు వేగవంతంగా చేపడుతున్న అధికారులు, సిబ్బందిని వారు శనివారం అభినందించారు. ఇప్పటి వరకు నగర వ్యాప్తంగా 2,561 కిలోమీటర్ల పైప్ లైన్లు, 2.03 లక్షల మ్యాన్ హోళ్లను శుభ్రం చేశామని వెల్లడించారు.
హైదరాబాద్‌లోని అన్ని పైప్లైన్లు, మ్యాన్ హోళ్లను శుభ్రం చేసేందుకు డీ-సీల్టింగ్ పనులను గతేడాది అక్టోబర్ 2న ప్రారంభించారు.90 రోజుల్లో మంచి ఫలితాలు రావడంతో వ్యర్థాలు తొలగించడానికి గడువును మరో 90 రోజులు పొడిగించారు. సీవరేజ్ ఓవర్ ఫ్లో ఫ్రీ సిటీ-హైదరాబాద్ పేరిట చేపట్టిన వ్యర్థాల తొలగింపు పనులను మరింత వేగవంతం చేయాలని జలమండలి ఎండీ, ఈడీ అధికారులు, సిబ్బందికి సూచించారు. పనుల పురోగతిపై సంబంధిత సీజీఎంలు, డైరెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. నిర్దేశిత సమయంలో లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు