శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 2: బత్తుల ప్రభాకర్ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నాలుగు రాష్ర్టాల్లో 80కి పైగా కేసుల్లో నిందితుడని, 28 కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. ఫ్రీజం పబ్ కాల్పులు కలకలంతో అతడ్ని అదుపులోకి తీసుకున్న సైబరాబాద్, మాదాపూర్ సీసీఎప్ పోలీసులు.. నిందితుడి ఇంట్లో సోదాలు నిర్వహించి మూడు గన్లు, 451 రౌండ్ల బుల్లెట్లు, మూడు సెల్ఫోన్లు, రూ. 62,000 నగదు, ఓ ఎలక్రికల్ రాడ్కట్టర్ యంత్రం, ఓ ఐరన్ రాడ్, ఎలక్ట్రీకల్ ఎక్స్టెన్షన్ బాక్స్, కటింగ్ బ్లేడ్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఆదివారం గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సైబరాబాద్ క్రైం డీసీపీ నర్సింహులుతో కలిసి కేసు వివరాలు వెల్లడించారు.
చిత్తూరు జిల్లా, సోమలధరి మండలం, వడ్డెపల్లి ఇరికిపెంట గ్రామానికి చెందిన బత్తుల ప్రభాకర్ 2013లో తాళం వేసి ఉన్న ఇండ్లలో చోరీలతో నేర వృత్తిని ప్రారంభించాడు. చోరీ సొత్తుతో ఖరీదైన పబ్బులు, జిమ్‌లు, హోటళ్లకు తరచూ వెళుతూ.. విలాసవంతమైన జీవితానికి అలవాడుపడ్డాడు. నాలుగు రాష్ర్టాల్లో 80కి పైగా కేసుల్లో నిందితుడిగా, 28 కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు.
గచ్చిబౌలి పీఎస్ పరిధిలోని ఓ అపార్టుమెంట్లో స్నేహితుడి పేరుతో అద్దెకు ఉంటున్న బత్తుల ప్రభాకర్‌పై నిఘాపెట్టిన మాదాపూర్ సీసీఎస్ పోలీసులు.. శనివారం ఫ్రీజం పబ్ దగ్గర అతడి కోసం కాపుకాసి పట్టుకున్నారు. ఈ క్రమంలో అతడు పోలీసులపైకి రెండు రౌండ్లు కాల్పులు జరపగా, సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డి ఎడమ పాదానికి గాయమైంది. నిందితుడి నుంచి మొత్తం మూడు గన్లు, 451 రౌండ్ల బుల్లెట్లు, మూడు సెల్ఫోన్లు, రూ.62,000 నగదును స్వాధీనం చేసుకున్నారు.
విశాఖపట్నం సెంట్రల్‌జైలులో ఉన్నప్పుడు అక్కడ ఉన్న మరో ఖైదీకి బత్తుల ప్రభాకర్‌కు మధ్య వైరం పెరిగి ద్వేషంగా మారిందని, దీంతో ఎలాగైనా జైలు నుంచి తప్పించుకొని సదరు ఖైదీ విడుదలయ్యాక అతడిని హతమార్చాలని వలపన్నినట్లు డీసీపీ తెలిపారు. బీహార్ నుంచి మూడు దేశవాళీ గన్లు, 453 రౌండ్ల బుల్లెట్లు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.
జైలుకు వెళ్లకముందు ఇండ్లలో చోరీలు చేసిన ప్రభాకర్.. ఆ తర్వాత కేవలం ఇంజినీరింగ్ కళాశాలలు, విద్యాసంస్ధలను లక్ష్యంగా చేసుకొని రెక్కీ నిర్వహించి చోరీలకు పాల్పడుతున్నట్లు వివరించారు. ఈ క్రమంలో సైబరాబాద్ పరిధిలో రూ. 2.5 కోట్లు చోరీ చేసినట్లు పేర్కొన్నారు. సెల్‌ఫోన్ ఎక్కువగా వాడడం, ఎవరితోనూ ఎక్కువగా కలవడం అతడి ఇష్టం ఉండదని, ఒంటరిగా తిరుగుతూ చోరీలు చేయడం.. వచ్చిన డబ్బులతో ఖరీదైన పబ్బులు, హోటళ్లలో జల్సాలు చేయడం, ఖరీదైన జిమ్‌లకు వెళ్లడం హాబీగా మార్చుకున్నాడని డీసీపీ తెలిపారు.