CV Anand | సిటీబ్యూరో, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): వచ్చే వారం జరిగే గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ ఊరేగింపులకు సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లపై జోన్ల వారీగా వరుస సమీక్షలు నిర్వహిస్తూ.. దృఢ సంకల్పంతో పనిచేయండి.. మీ వెంట నేనున్నాను.. అంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సిబ్బందికి భరోసా ఇస్తున్నారు.
గురువారం సౌత్ ఈస్ట్, ఈస్ట్‌జోన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ రెండు జోన్లలో అత్యంత సున్నితమైన ప్రాంతాలు ఉన్నాయని అధికారులకు పలు సూచనలు చేశారు. అధికారులు ఒత్తిడి లేకుండా ధైర్యంగా, స్వేచ్ఛగా పనిచేయాలని సూచించారు. కమ్యూనల్ రౌడీలు, ఇతర సంఘ విద్రోహ శక్తులపై నిఘా పెంచాలని, మత సామరస్యానికి భంగం కలిగించే వారికి కౌన్సెలింగ్ నిర్వహించి బైండోవర్ చేయాలని ఆదేశించారు. దృఢ సంకల్పంతో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే విధంగా మానసికంగా సిద్ధంగా ఉంటూ విధులు నిర్వహించాలన్నారు.
ఈ ప్రయత్నంలో ఎలాంటి అవరోధాలు ఎదురైనా మీ వెంట నేనుంటానని పోలీస్ కమిషనర్ సిబ్బందికి భరోసా ఇచ్చారు. ఇటీవల జరిగిన పలు ఘటనలపై స్పెషల్ బ్రాంచ్ అధికారులు ఉన్నతాధికారులకు వివరించారు. గణేశ్ విగ్రహాల ఊరేగింపు సజావుగా సాగేందుకు క్షేత్ర స్థాయిలో గుర్తించిన ఇబ్బందులను సీపీ దృష్టికి తీసుకెళ్లారు. విగ్రహాల ఎత్తుకు తగ్గట్టుగా నిర్దేశిత మార్గాల్లో విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లాలని ట్రాఫిక్ అధికారులకు సీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో సౌత్ఈస్ట్ జోన్ డీసీపీ కాంతిలాల్ సుభాష్, ఈస్ట్‌జోన్ డీసీపీ బాలస్వామి, ట్రాఫిక్ డీసీపీ ఎన్.అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.