ఉస్మానియా యూనివర్సిటీ, మే 22: ఉస్మానియా యూనివర్సిటీ ఇంచార్జి వీసీగా( In-charge Vice Chancellor) సీనియర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్(Dana Kishore) బాధ్యతలు స్వీకరించారు. ఓయూ పరిపాలనా భవనానికి వచ్చిన ఆయనకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ స్వాగతం పలికారు. వీసీ చాంబర్లో మాజీ వీసీ ప్రొఫెసర్ రవీందర్ నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) ఇంచార్జి వైస్ చాన్స్‌లర్‌గా బాధ్యతలు స్వీకరించడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. తాను ఎన్నో కీలక పదవులు చేపట్టినప్పటికీ, ఓయూ వీసీగా బాధ్యతలు తీసుకోవడం భిన్నమైన అనుభూతిని ఇచ్చిందని అభిప్రాయపడ్డారు. తనకున్న పరిధి మేరకు ఓయూలోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు.
నిరంతర ఉత్సాహం, ఉత్తేజంతో పాటు విభిన్న రంగాల్లో నాయకత్వాన్ని అందించిన ఘనత ఓయూ సొంతమని అన్నారు. ఆయనను వివిధ ఫ్యాకల్టీల డీన్లు, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, డైరెక్టర్లు, ఇతర అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వివిధ విద్యార్థి సంఘాల నాయకులతో ఆయన సమావేశమై యూనివర్సిటీ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వేర్వేరుగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపి, వర్సిటీ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు.