హైదరాబాద్: పారిశుధ్యం, పరిశుభ్రతపై అశ్రద్ధ వహిస్తే కఠిన చర్యలు తప్పవని పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ (Dana Kishore) అధికారులను హెచ్చరించారు. గురువారం జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో హెచ్ఎండీఏ నిధులు రూ. 1.25 కోట్లతో బాల గార్డెన్ ఫంక్షన్‌హాల్ నుంచి గుర్రం చెరువు వరకు 800 మీటర్ల మేర నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పనులు పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ వాణి, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ వెంకన్నకు సూచించారు.
అనంతరం చాంద్రాయణగుట్ట జోనల్ పరిధి గుర్రం చెరువు రోడ్డు మార్గాన్ని పరిశీలించారు. ఇష్టారీతిన పడి ఉన్న ఇరిగేషన్ శాఖకు చెందిన నీటి పైపులు, నిరుపయోగ ఉన్న మరుగుదొడ్లను వెంటనే తొలగించాలని సౌత్‌జోన్ కమిషనర్ వెంకన్న, చాంద్రాయణగుట్ట డీసీ సురేందర్‌ను ఆదేశించారు. రహదారికి ఇరువైపులా చెత్తాచెదారం, వ్యర్థాలు ఉండటంతో ఏమిటీ చెత్త అంటూ..దానకిశోర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే రోడ్డు మీదుగా బాలాపూర్ గణేశ్ నిమజ్జన ఊరేగింపు జరుగనున్న నేపథ్యంలో పారిశుధ్యం, పరిశుభ్రతపై అలసత్వం చేస్తే సహించేది లేదన్నారు. ఈ మార్గంలో పెండింగ్‌లో ఉన్న సీసీ, బీటీ రోడ్డు నిర్మాణ పనులను మిషన్ మోడ్‌లో చేపట్టి పూర్తి చేయాలన్నారు.