మల్కాజిగిరి, జనవరి 30: దళితులు ఆర్థికంగా ఎదుగడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో 13,129 దళితుల ఇండ్లు ఉన్నాయి. ఇందులో 52,510 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. మల్కాజిగిరి సర్కిల్లో 3,858 ఇండ్లు, 15,428 మంది ఉన్నారు. అల్వాల్ సర్కిల్లో 9,271 ఇండ్లు, 37,082 మంది ఉన్నారు.
నియోజక వర్గానికి మొదటి విడతగా వంద మంది..
ప్రభుత్వం నియోజక వర్గానికి మొదటి విడతగా వంద మందిని ఎంపిక చేయనున్నారు. వీరికి ఒక్కొక్కరికి దళితబంధు పథకంలో రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నారు. దళితబంధు పథకం అమలు కోసం జిల్లా క్రీడల అధికారి జి.బల రామారావును ప్రత్యేక అధికారిగా నియమించారు. లబ్ధిదారులు రూ.10 లక్షల విలువగల ఆటో (7గురు కూర్చునే), ఆటో ట్రాలీ, రిటైల్ దుకాణాలు, హోటల్, ఇనుప గ్రిల్స్ వెల్డింగ్, మోటర్ వైండింగ్ వంటి వాటిని ఏర్పాటుచేసుకోవచ్చు. ఇందుకోసం అధికారుల స్వయం ఉపాధి కోసం సూచనలు చేస్తారు.
దరఖాస్తుల వివరాలు..
దళితబంధు పథకం కోసం దరాఖాస్తు చేసుకోవాలనుకునేవారు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్, ఓటర్, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, పాన్‌కార్డు, రెండు ఫొటోలు జతచేయాలి. లబ్ధిదారుడు మల్కాజిగిరి నియోజకవర్గానికి చెందినవాడై ఉండాలి. దళితబంధు పథకంలో దరఖాస్తులు తీసుకోవడానికి ఫిబ్రవరి 5న చివరి తేదీగా ప్రభుత్వం ప్రకటించింది. దరఖాస్తులను మల్కాజిగిరి సర్కిల్ ఆనంద్‌బాగ్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో అందజేయాలి.
పారదర్శకంగా అర్హుల ఎంపిక
దళితబంధు పథకంలో అర్హులైనవారి ఎంపిక పారదర్శకంగా ఉంటుంది. దళితులు ఆర్థికంగా అభివృద్ధి చేందడానికి మొదటి విడతగా అర్హులైన వంద మందిని ఎంపిక చేస్తాం. వారిలో ఒక్కొక్కరికీ రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేస్తాం. ఎంపికైన వారికి యూనిట్ ఎంపిక కోసం అవసరమైన సలహాలు అధికారులు ఇస్తారు.