మేడ్చల్, డిసెంబర్ 17 : రానున్న పదేండ్ల కాలంలో భారత్ గ్లోబల్ లీడర్‌గా మారనున్నదని సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ సీఈవో శ్రీరామ్ బిరుదవోలు, సెక్యూరిటీ కౌన్సిల్ సహ కార్యదర్శి కావేటి సంతోశ్ అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల 14వ స్నాతకోత్సవం శనివారం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైన్స్, టెక్నాలజీలో దేశం కొంత పుంతలు తొక్కుతుందన్నారు. కృత్రిమ మేథ వినియోగంలో కూడా భారత్ ముందుందన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులు భావి జీవితంలో కొత్త కొత్త ఆలోచనలతో, నూతన ఆవిష్కరణలో సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. అనంతరం విద్యార్థులకు పట్టాలను, ప్రతిభ చూపిన విద్యార్థులకు పతకాలను అందజేశారు.
కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆనంద్, హెచ్వోడీలు డాక్టర్ శ్రీకాంత్, విఘ్నేశ్, శ్రీనివాస్, మోహన్ కుమార్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.