సిటీబ్యూరో, మార్చి 27(నమస్తే తెలంగాణ): డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసం చేసి డబ్బులు దోచుకున్న ముగ్గురిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు చెప్పిన ప్రకారం… హైదరాబాద్‌కు చెందిన వీరబోయిన సాయిరాజ్ గత సంవత్సరం నవంబర్ 28వ తేదీన తనకు ఓ సెల్ నుంచి నుంచి కాల్ వచ్చిందని, సైబర్ నేరస్తుడు తాను ముంబై బాంద్రాలోని కుర్లా పీఎస్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్ సంజయ్పాటిల్గా పరిచయం చేసుకున్నాడని తెలిపారు.
ఆ తర్వాత కోర్టులో సాయిరాజ్‌పై ఓ కేసు నమోదైందని, అతడి అకౌంట్ నుంచి రూ.25లక్షల మనీలాండరింగ్ జరిగినట్లు బెదిరించాడు. ఆ తర్వాత స్కైప్ కాల్‌కు రమ్మని చెప్పి ఆ మొత్తం అమౌంట్‌ను తన అకౌంట్‌కు వెరిఫికేషన్ కోసం ట్రాన్స్ఫర్ చేయమని అడిగితే తాను అలా చేయలేదని, తన దగ్గర అంత డబ్బులు లేవనడంతో తామే లోన్ ఇస్తామంటూ ముందుగా కొన్ని డబ్బులు పంపమని చెప్పి రూ.3,57,998 రెండు దఫాలుగా వారి అకౌంట్‌కు పంపించాడని, దీనికి అతడికి పోలీస్ క్లియరెన్స్ కూడా ఇస్తామని చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
తర్వాత తాను మోసపోయినట్లు గ్రహించడంతో సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించారని, దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులు గుంటూరుకు చెందిన తోట శ్రీనివాసరావు, లామ్ జీవన్‌కుమార్, తమ్మిశెట్టి రఘువీర్‌లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అయితే నిందితుల్లో తోటశ్రీనివాసరావు, లామ్జీవన్కుమార్ ఇద్దరూ ఫిజియో థెరపిస్ట్‌లుగా పోలీసులు పేర్కొన్నారు. ఈ ముగ్గురిపై దేశవ్యాప్తంగా 14 కేసులున్నాయని, తెలంగాణలో ఒక కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.