సిటీబ్యూరో, జనవరి 26(నమస్తే తెలంగాణ): పోలీస్ యూనిఫామ్ ఎంతో గౌరవప్రదమైదని, బాధ్యతగా భావించి, పోలీసులు అంకిత భావంతో ప్రజలకు సేవ చేయాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి అన్నారు. ఆదివారం సైబరాబాద్ కమిషనరేట్‌లోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీపీ దేశ స్వాతంత్య్రం కోసం వీర మరణం పొందిన మహనీయుల చిత్రపటాలకు నివాళులర్పించి, వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సీపీ పోలీసులు, ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ 1950లో జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని, నాటి నుంచి భారత దేశం గణతంత్రంగా అవతరించిందన్నారు. అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన 29మంది పోలీసు సిబ్బందికి అతి ఉత్కృష్ట సేవా పతకాలు, 18మందికి ఉత్కృష్ట సేవా పతకాలను ప్రదానం చేశారు. ఈకార్యక్రమంలో జాయింట్ సీపీ (ట్రాఫిక్) డి.జోయల్, మాదాపూర్ డీసీపీ డా.వినీత్, మేడ్చల్ డీసీపీ ఎన్.కోటిరెడ్డి, బాలానగర్ డీసీపీ కె.సురేశ్‌కుమార్, రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, శంషాబాద్ డీసీపీ రాజేశ్, క్రైమ్ డీసీపీ కె.నర్సింహ, ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ విభాగం డీసీపీ సృజన, ఈఓడబ్ల్యూ డీసీపీ కె.ప్రసాద్, ఎస్బీ డీసీపీ సాయిశ్రీతోపాటు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కొత్త క్రిమినల్ చట్టాలపై హ్యాండ్ బుక్ ప్రిపేర్ చేస్తున్నామని అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా అన్నారు. ఈ హ్యాండ్ బుక్‌ను తెలుగులో సైతం అనువదిస్తున్నట్టు పేర్కొన్నారు. డీజీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. అనంతరం అడిషనల్ డీజీపీ జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో తెలంగాణ స్పోర్ట్స్, డ్యూటీ మీట్‌ను నిర్వహించనున్నామన్నారు. జైళ్ల శాఖలో గ్రీన్ ప్రిజన్స్ ఇనిషియేటివ్‌లో భాగంగా 530 కేడబ్ల్యూ సోలార్ పవర్ సిస్టమ్‌ను వినియోగించాలని భావిస్తున్నట్టు తెలిపారు. తద్వారా 20శాతం విద్యుత్తు బిల్లులు తగ్గుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐజీ రమణకుమార్, సీఎస్ఓ యోగేశ్వరావు, డీజీపీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
అబ్కారీ భవన్లో గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యాలయం ఆవరణలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమిషనర్ చెవ్వూరు హరి కిరణ్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి బి కమలాసన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి జెండా వందనం చేశారు. అంతకుముందు కమిషనర్, డైరెక్టర్ ఎక్సైజ్ పోలీసుల గౌరవ వందనాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ అజయ్‌రావు, జాయింట్ కమిషనర్లు ఖురేషీ, కేఏబీ శాస్త్రి, బెవరీస్ జనరల్ మేనేజర్ అబ్రహం, అసిస్టెంట్ కమిషనర్లు అనిల్‌కుమార్‌రెడ్డి, శ్రీనివాస్, చంద్రయ్య, డిప్యూటీ కమిషనర్లు దశరథ్, రఘురాం, శ్రీధర్, శీలం శ్రీనివాస్, రంగారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, సీఐలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.