సిటీబ్యూరో, డిసెంబర్ 10(నమస్తే తెలంగాణ): దొంగిలించిన 1100 సెల్ఫోన్లను సైబరాబాద్ పోలీసులు రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. మంగళవారం సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో క్రైమ్స్ డీసీపీ కె. నర్సింహ ఈ సెల్ఫోన్లను బాధితులకు అందజేశారు. 45 రోజుల్లో సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టార్(సీఈఐఆర్) పోర్టల్లో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ సెల్ఫోన్లను రికవరీ చేసినట్లు డీసీపీ వివరించారు. రికవరీ చేసిన ఫోన్ల విలువ రూ.3.3కోట్లు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. నేడు సెల్ఫోన్ అనేది నిత్యావసర వస్తువుగా మారిందని, అందులో ఉండే డేటా కూడా చాలా విలువైందని, దానిని కాపాడుకోవాలన్నారు. బ్యాంకు ఖాతాలు, వాటి పాస్వర్డ్లు కూడా అందులోనే ఉంటున్నాయని, ఇలాంటి డేటాను ఫోన్లలో ఎలా భద్రపర్చుకోవాలనే విషయాలను ఆయన వివరించారు.
సీఈఐఆర్ పోర్టల్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సైబరాబాద్ పోలీసులు 7500 ఫోన్లను రికవరీ చేశారని, అందులో ఈ ఏడాది 5500 ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. మాదాపూర్, బాలానగర్, మేడ్చల్, రాజేంద్రనగర్, శంషాబాద్ సీసీఎస్ విభాగాలతో పాటు ఆయా జోన్ల లాఅండ్ఆర్డర్ పోలీస్, ఐటీ సెల్ సంయుక్తంగా ఈ రికవరీ చేశాయన్నారు. ఈ సందర్భంగా పోయిన ఫోన్ చేతికి తిరిగి అందడంతో పలువురు బాధితులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.