సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): లైంగిక దాడులకు పాల్పడే నేరస్తుల డాటా తయారీపై సైబరాబాద్ పోలీసులు సన్నాహాలు మొదలు పెట్టారు. ఇటీవల ఓ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సెక్స్ అఫెండర్స్ డాటా తయారు చేయాలని.. తద్వారా వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రాకుండా చేయాలని సూచించిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగానే సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మంగళవారం సెక్స్ అఫెండర్స్ డాటా తయారీ విధానంపై సమీక్ష నిర్వహించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీతా కృష్ణన్ పాల్గొని సెక్స్ అఫెండర్స్ రిజిస్ట్రీ విధానంపై ప్రజెంటేషన్ ఇచ్చారు. లైంగిక దాడులకు పాల్పడే నేరస్తులకు సంబంధించిన డాటాను ప్రపంచ వ్యాప్తంగా ఎలా రూపొందిస్తున్నారన్న విషయాన్ని కూడా వివరించారు. ఈ సమీక్షలో డీసీపీ (క్రైమ్స్) కల్మేశ్వర్ సింగెనవర్, డీసీపీ దార కవిత, షీ టీమ్స్ ఇన్స్పెక్టర్ సునీత తదితరులు పాల్గొన్నారు.