సిటీబ్యూరో, జూలై 5 (నమస్తే తెలంగాణ): ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రేడింగ్‌లో అధిక లాభాలంటూ సైబర్‌నేరగాళ్లు ఒక ప్రైవేట్ ఉద్యోగికి రూ. 15 లక్షలు బురిడీ కొట్టించారు. కూకట్‌పల్లికి చెందిన బాధితుడు ఇన్‌స్టాగ్రామ్‌లో చూసిన యాడ్‌తో నాకా సొల్యూషన్ అనే ఫ్లాట్ ఫామ్‌లోకి వెళ్లారు. దీంతో తాము సంస్థ ప్రతినిధులమంటూ అర్జున్‌రెడ్డి పేరుతో ఫోన్ చేసిన సైబర్‌నేరగాళ్లు, తాము క్రూడ్ అయిల్, గోల్డ్, సిల్వర్ ట్రేడింగ్‌పై మెలకువలు చెబుతామంటూ నమ్మించారు. వాట్సాప్‌లో బాధితుడికి నాకా సొల్యూషన్ ట్రేడింగ్ ఆటోమెటిక్ పేరుతో ఒక లింక్‌ను పంపించడంతో బాధితుడు అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు.
ఇక మొత్తం క్రూడ్ అయిల్, బంగారం, సిల్వర్‌పై ట్రేడింగ్ చేస్తే భారీ లాభాలొస్తాయంటూ నమ్మిస్తూ రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టించారు. స్క్రీన్‌పై పెట్టుబడి, లాభాలతో 2 లక్షల డాలర్లు చూపిస్తున్నాయి, అయితే వాటిని విత్ డ్రా చేసుకునే వీలు లేకుండాపోయింది. స్క్రీన్‌ఫై కన్పించే లాభాలు విత్ డ్రా చేసుకోవాలంటే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ 12 శాతం చెల్లించాలని ఆ తరువాత ఆ నగదు విత్ డ్రా చేసుకోవచ్చంటూ షరతు విధించారు. దీంతో బాధితుడు సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.