సిటీబ్యూరో, జూన్ 27 (నమస్తే తెలంగాణ): ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రివార్డు పాయింట్లు పోతాయంటూ మెసేజ్ పంపి ఫిషింగ్ స్కామ్ క్రెడిట్ కార్డు మోసం చేసిన ఘటనకు సంబంధించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. సికింద్రాబాద్‌కు చెందిన 75 ఏండ్ల వ్యక్తికి ఐఓసీ రివార్డు పాయింట్లు గడువు ముగిసిపోతుందంటూ తెలియని నంబర్ నుంచి ఓ టెక్స్ మెసేజ్ వచ్చింది.
ఈ పాయింట్లను రిడీమ్ చేసుకోవడానికి ఒక లింక్‌ను క్లిక్ చేయాలంటూ ఆ లింక్‌ను మెసేజ్‌లో పెట్టారు. ఈ మెసేజ్ నిజమేననుకున్న బాధితుడు లింక్ క్లిక్ చేస్తే రూ.399 చెల్లించాలని అందుకు బదులుగా రూ.10వేల విలువైన అమెజాన్ వోచర్‌ను అందించే వెబ్‌సైట్‌కు లింక్ చేసినట్లు బాధితుడు తెలిపారు.
ఆఫర్‌ను నమ్మిన బాధితుడు నేరగాళ్లు సూచించిన విధంగా ముందుకు పోగా.. హెచ్ఎస్బీసీ క్రెడిట్ కార్డ్ సర్వీసెస్ నుంచి ఒక ఓటీపీ రాగా.. ఇది అమెజాన్ నుంచి వచ్చిన ఓటీపీగా నమ్మి సైబర్ నేరగాళ్లకు చెప్పాడు. దీంతో దాదాపు రూ.1,28,969లను ఉపయోగించినట్లుగా మెసేజ్ రాగా బాధితుడు తాను మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.