సిటీబ్యూరో, జూలై 23 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు వృద్ధుడి నుంచి డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.35.7 4లక్షలు కొట్టేసిన ఘటన దోమలగూడలో జరిగింది. ఈనెల 6న 79 ఏళ్ల వృద్ధుడికి విజయ్‌ఖన్నా అనే వ్యక్తి తాను కోలబా పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నానని, తాను సీబీఐ ఆఫీసర్నని కాల్ చేశాడు. బాధితుడి పేరుతో కోలబా ప్రాంతంలోని కెనరా బ్యాంక్‌కు చెందిన అకౌంట్‌తో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారంటూ, తాము నరేశ్‌గోయల్ అనే వ్యక్తిని విచారించే క్రమంలో ఈ విషయం వెలుగుచూసిందంటూ బెదిరించారు.
ఆయుష్ గుప్తా అనే వ్యక్తి తాను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంటూ డబ్బులు పంపించాలంటూ ఒత్తిడి చేసి ఇన్వెస్టిగేషన్ లిస్ట్‌లో అతని పేరు లేకుండా చేస్తాననడంతో నమ్మిన బాధితుడు.. నేరగాళ్లు చెప్పిన ఖాతాకు రూ.35.74 లక్షలు బదిలీ చేసి మోసపోయాడు.
నాచారానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగిరాలైన బాధితురాలు ఫేస్బుక్లో కల్కీ పేరుతో ఉన్న ఈ- కామర్స్ వెబ్‌సైట్‌ను క్లిక్ చేసింది. అందులో రూ. 1400 విలువైన దుస్తులు ఆర్డర్ చేసింది. ఇంటికి ఒక పార్సిల్ వచ్చింది. అందులో ఇతర వస్తువులను ఒక ప్లాన్ ప్రకారం సైబర్‌నేరగాళ్లు పంపించారు. ఆ వెబ్సైట్లో ఉన్న కస్టమర్ కేర్ కాంటాక్టు నంబర్‌కు ఫోన్ చేయడంతో ఎవరు లిఫ్ట్ చేయలేదు. కొద్దిసేపటి తరువాత మరో నంబర్ నుంచి సైబర్‌నేరగాళ్లు ఫోన్ చేసి ఏపీకే ఫైల్‌ను వెంటనే ఇన్స్టాల్ చేసుకొని, స్క్రీన్ షాట్ పంపించి, మీ వివరాలు పంపించడంటూ సూచించాడు. ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ కావడంతో బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 1.68 లక్షలను దోచేశారు.