సిటీబ్యూరో, అక్టోబరు 11(నమస్తే తెలంగాణ): అక్రమంగా సిమ్ కార్డులను కొనుగోలు చేసి.. ఆ నంబర్లను గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో పెట్టి అమాయకులను మోసం చేస్తున్న జార్ఖండ్ రాష్ట్రం దియోఘర్ ప్రాంతానికి చెందిన 10 మంది సైబర్ నేరగాళ్లను రాచకొండ సైబర్ క్రైం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సీసీ మహేశ్‌భగవత్ వెల్లడించిన వివరాల ప్రకారం… జమీల్ అన్సారీ, బర్జాహాన్, అక్లక్ హూస్సేన్, సర్ఫారజా, సిరాజ్, సుశీల్, సునీల్ కుమార్ దాస్, శేఖర్ కుమార్, వినోద్, రాంచరణ్‌లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.
ఈ -కామర్స్ వెబ్సైట్, బ్యాంక్‌లు, గూగుల్-పే, పేటీఎం, ఫోన్‌పే, ఇతర కార్పొరేట్ సంస్థలు..ఇలా ఆయా కస్టమర్ కేర్ నంబర్లను ఎవరైనా వెతికినప్పుడు మొదటి వరుసలో వీరి ఫోన్ నంబర్లు ఉండేలా చూసుకుంటున్నారు. ఎవరైనా ఫోన్ చేస్తే… వివిధ రూపాల్లో ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఈ ముఠాను జార్ఖండ్ పోలీసులు అరెస్టు చేయగా, పీటీ వారెంట్ పై నగరానికి తీసుకువచ్చిన రాచకొండ పోలీసులు..వారిని రిమాండ్‌కు పంపారు.
సైబర్ నేరగాళ్ల మోసాలు కొనసాగుతున్నాయి. పాన్‌కార్డు అప్డేట్ చేయాలంటూ డబీర్‌పురాకు చెందిన అస్లం పాషాకు రూ. 4.9 లక్షలు టోకరా వేశారు. మరో ఘటనలో ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన అన్వేష్‌రెడ్డికి అమెజాన్‌లో ఉద్యోగమంటూ నమ్మించి లింక్ పంపించారు. అది క్లిక్చేయగానే అమెజాన్ 179.కామ్ పేరుతో యాప్ ఓపెన్ అయింది. అందులో పెట్టుబడి పెడుతూ టాస్క్ పూర్తి చేస్తే భారీ లాభాలొస్తాయంటూ నమ్మించి రూ. 2.4 లక్షలు కాజేశారు. ఆయా ఫిర్యాదులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.