బంజారాహిల్స్, ఏప్రిల్ 3 : ఇంటిని అద్దెకు తీసుకుంటామని నమ్మించి డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆదిత్యా హిల్ టాప్ కాలనీలో నివాసముంటున్న గుడిపాటి మహేందర్‌రెడ్డికి తార్నాక సమీపంలోని వాయుపురి కాలనీలో ఇల్లు ఉంది. ఈ ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు నో బ్రోకర్ డాట్‌కామ్‌లో ప్రకటన ఇచ్చాడు. రెండురోజుల కిందట విజయ్ అనే వ్యక్తి ఫోన్ చేసి తాను సీఐఎస్ఎఫ్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు.
తనకు హైదరాబాద్‌కు ట్రాన్స్ఫర్ అయ్యిందని తనకు ఇల్లు అద్దెకు కావాలని కోరాడు. దీంతో అడ్వాన్స్‌గా రూ.48వేలు పంపించాలని మహేందర్‌రెడ్డి తెలుపగా విజయ్ గూగుల్‌పే ద్వారా డబ్బులు పంపిస్తానని చెప్పాడు. దీనికోసం ముందుగా తాను ఒక రూపాయి పంపిస్తానని, దాన్ని రిసీవ్ చేసుకునేందుకు క్యూఆర్ కోడ్ పంపించాలని కోరాడు. దీంతో అతడు కోరిన విధంగా క్యూఆర్ కోడ్ పంపించడంతో పాటు రూ.1 పంపించాడు. వెంటనే అతడి అకౌంట్లోనుంచి రూ.లక్ష కాజేశారు. ఈ మేరకు తాను మోసపోయినట్లు గుర్తించిన మహేందర్‌రెడ్డి సోమవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.