సిటీబ్యూరో, మే 8(నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిని డ్రగ్స్, స్మగ్లింగ్ చేస్తున్నావంటూ బెదిరించి.. అతని నుంచి దఫాల వారీగా రూ.1.23 కోట్లు దోచుకున్న సైబర్ నేరగాడు మహారాష్ట్రలోని పూణెకు చెందిన రాంప్రసాద్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన 45ఏళ్ల డాక్టర్‌కు ఒక మొబైల్ నుంచి కాల్ వచ్చింది. అందులో ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుంచి బాధితుడి పేరుమీద ఒక పార్సిల్ వచ్చిందని, అందులో 14 పోలీస్ యూనిఫామ్స్, 14ఐడీకార్డ్స్, 3 డెబిట్ కార్డ్స్, 4 కెటమిన్ ఇంజెక్షన్స్ ఉన్నట్లుగా చెప్పారు.
దీంతో డాక్టర్.. ఆ పార్సిల్‌తో తనకు సంబంధం లేదని, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పగా.. సైబర్ నేరగాడు వెంటనే ఫేక్ పోలీసులకు లైన్ కనెక్ట్ చేశాడు. వాళ్లు డాక్టర్‌ను బెదిరించారు. ఆ తర్వాత వీడియోకాల్‌చేసి సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ అం టూ బెదిరించారు. ఇలా బెదిరింపులకు పాల్పడి చివరకు వెరిఫికేషన్ కోసం డబ్బులు అడుగగా మొదట రూ.29లక్షలు పంపి.. ఆ తర్వాత విడతల వారీగా రూ.1.23కోట్లు పంపించాడు. చివరికి మోసపోయిన విషయాన్ని గ్రహించిన బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టి రెండో నిందితుడు రాంప్రసాద్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడిపై తెలంగాణలో 4కేసులుండగా, దేశవ్యాప్తంగా 22 కేసులున్నాయి.