జీడిమెట్ల, ఆగస్టు 12 : ఉన్నత విద్యావంతులే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి లక్షలాది రూపాయాలు కోల్పోతున్నట్లు పత్రికల్లో, మీడియాలో పలు కథనాలు వెలువడుతున్నా ఇంకా చాలామంది మోసపోతూనే ఉన్నారు. స్మార్ట్‌ఫోన్ వాడకం ఎంత తెలిసి ఉన్నా.. గూగుల్‌లో వెతుకుతూ.. సోషల్ మీడియాను వాడుతూ గుర్తుతెలియని వ్యక్తుల మాటలు నమ్మి అత్యాశతో సైబర్ నేరగాళ్ల మాయలో పడి లక్షలాది రూపాయాలు పోగొట్టుకుంటున్నారు. గడిచిన మూడు నెలల్లో జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో సుమారు 80 సైబర్ క్రైం కేసులు నమోదయ్యాయి. ఇలాంటివాటిపైన ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు జీడిమెట్ల పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
ఆన్లైన్లో కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిఫోన్ నంబర్లకు గుర్తుతెలియని వ్యక్తులు కాల్ చేస్తారు. ఆధార్‌కార్డు నంబర్ చెప్పమని అడుగుతారు. వెంటనే మీ ఫోన్‌కు వచ్చిన ఎస్ఎంఎస్ నంబర్ అడుగుతారు. అది మాములు నంబరే కదా అని మీరు వెంటనే చెప్పేస్తారు. కానీ మీకు తెలియని విషయం ఎమిటంటే అది ఒక ఓటీపీ, ఆ నంబర్ ద్వారా మీ పేరుపైన రూ.2 లక్షల వరకు లోన్ తీసుకుని మిమ్మల్ని మోసం చేస్తారు. ఇంకా మీ ఫేస్‌బుక్‌కు అందమైన అమ్మాయి ఫొటోతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుంది. మీరు అక్సెప్ట్ చేయగానే హాయ్, హాలో అంటూ చాటింగ్ చేస్తారు. అనంతరం మీకు కాల్ చేసి వాట్సాప్ నంబర్ తీసుకుని చాట్ చేస్తారు. మెల్లగా ముగ్గులోకి దింపి వీడియో కాల్ చేసి అర్ధనగ్నంగా, నగ్నంగా కనబడుతారు. తర్వాత మిమ్మల్ని నమ్మించి మీరు అదేవిధంగా చేయాలని అడుగుతారు. ఒకటి, రెండు సార్లు అలా చేసి మిమ్మల్ని నమ్మించి మీ వీడియోలు రికార్డు చేయడంతోపాటు మీఫొటోలు స్క్రీన్ షాట్ తీస్తారు. అప్పుడూ అసలు కథ మొదలై మిమ్మల్నీ బ్లాక్ మెయిలింగ్ చేసి మీనుంచి డబ్బులు లాగుతారు.
చింతల్‌కు చెందిన ఓ గృహిణి ఎంబీఏ చదివింది. ఒక రోజు ఆమెకు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి మీరు కౌన్ బనేగా కరోడ్ పతిలో రూ.25 లక్షలు గెలుచుకున్నారని చెప్పారు. వారి మాటలు సదరు గృహిణి నమ్మింది. మరుసటి రోజునుంచి ప్రాసెసింగ్, మనీ ట్రాన్స్ఫర్, ఆర్టీఎఫ్ల నిమిత్తం డబ్బు పంపాలని పలు దఫాలుగా ఆమె నుంచి మొత్తం రూ.8 లక్షలకు పైగా వసూలు చేసి మోసం చేశారు. అంతేకాకుండా షాపూర్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తికి ఫార్మ పరిశ్రమలో మంచి వేతనంతో కూడిన ఉద్యోగం. అతను ఆన్లైన్లో లోన్ కోసం గూగుల్‌లో వెతికి లోన్‌బజార్ యాప్‌ను సంప్రదించాడు. లోన్ ఇస్తామని తీయని మాటలతో నమ్మించిన సైబర్ నేరగాళ్లు ప్రాసెసింగ్, ఈఎంఐ, మనీ ట్రాన్స్ఫర్ పేరిట రూ.లక్ష పైగా వేయించుకుని అడ్డంగా ముంచేశారు. ఇలా అన్ని తెలిసిన విద్యావంతులే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోతూ ఆయా పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు. సైబర్ క్రైం కేసులు ఛేదించాలంటే ఖర్చుతో పాటు సమయం సరిపోకపోవడంతో, ఆధారాలు లభించకపొవడంతో రోజురోజుకూ సైబర్ కేసులు పెరిగిపోతున్నాయి.
ప్రతిఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి. ప్రతిరోజు టీవీల్లో, న్యూస్ పేపర్లతో ప్రచురితం అయ్యే సైబర్ హెచ్చరికలను గమనిస్తూ ఉండాలి. బహుమతుల పేరిట ఆఫర్ పేరిట, లోన్ల పేరిట గుర్తుతెలియని వ్యక్తులు చేసే ఫోన్ కాల్స్‌ను నమ్మవద్దు. అదేవిధంగా సైబర్‌నేరాలపై ప్రతి మంగళవారం ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. -జీడిమెట్ల సీఐ కె.బాలరాజు