సిటీబ్యూరో, జూన్ 29(నమస్తే తెలంగాణ): మీ హెర్బల్ ఫార్మురా నచ్చింది.. ఫార్ములా ఇస్తే మీకు రూ. 5 కోట్లు ఇస్తామంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు.. ఓ హెర్బల్ డాక్టర్‌కు రూ. 40 లక్షలు టోకరా వేశారు. మెహిదీపట్నంకు చెందిన శైలజాకుమారి అనే హెర్బల్ డాక్టర్ అమెరికా, లండన్‌లో ఉన్న వారికి కూడా సలహాలు ఇస్తారు. ఈ క్రమంలో జేమ్స్ మరియో అనే వ్యక్తి వాట్సాప్ ద్వారా ఆమెకు పరిచయమయ్యాడు. మీ హెర్బల్ ఫార్ములా.. తనకు అమ్మితే రూ. 5 కోట్లు ఇస్తానని చెప్పాడు. దీనికి బాధితురాలు ఒప్పుకొని ఫార్ములా పంపించింది. మీకు రూ.5 కోట్లు పంపిస్తానంటూ.. ఆమె బ్యాంకు ఖాతా నంబర్ తీసుకున్నాడు. మరుసటి రోజు తాము ఆర్బీఐ నుంచి మాట్లాడుతున్నామని, మీ బ్యాంకు ఖాతాలోకి విదేశాల నుంచి రూ.5 కోట్లు డిపాజిట్ అయ్యాయని, దీనిపై అనుమానాలున్నామంటూ చెప్పారు.
అయితే ఆర్బీఐ చార్జీలు చెల్లించాల్సి ఉంటుందంటూ ఆమె వద్ద నుంచి రూ.26 లక్షలు వసూలు చేశారు. అనంతరం ఎవరైతే డబ్బులు పంపించారో వాళ్లు వచ్చి సంతకం పెట్టాలని ఒకసారి… ఢిల్లీలో కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడని మరోసారి నమ్మించాడు. బ్లాక్ మనీ ఇచ్చేందుకు వస్తున్నానని… టాక్స్ పేరిట మరో రూ.14 లక్షలు వసూలు చేశాడు. ఆ తర్వాత తన కూతురు అనారోగ్యంతో ఉందని, కొంత డబ్బు కావాలంటూ అడిగి రూ. 2 లక్షలు వసూలు చేశాడు. అనంతరం తన కూతురు చనిపోయిందంటూ మరో నాటకం ఆడటంతో బాధితురాలికి అనుమానం వచ్చింది. వీడియో కాల్స్‌లో మాట్లాడు అంటూ ప్రశ్నించగా.. అందుకు సైబర్‌నేరగాళ్లు నిరాకరించారు. దీంతో అనుమానం వచ్చిన బాధితురాలు మంగళవారం సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని ఏసీపీ కేవీఎం ప్రసాద్ నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేపట్టింది.