సిటీబ్యూరో, సెప్టెంబర్ 4(నమస్తే తెలంగాణ): రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ పీఎంఏ పేరుతో ఓ రైటర్డు ప్రభుత్వ ఉద్యోగికి వల వేసిన సైబర్‌చీటర్స్ ట్రేడింగ్‌లో అధిక లాభాలిప్పిస్తామంటూ నమ్మించి రూ. 73.61 లక్షలు టోకరా వేశారు. వనస్థలిపురం ప్రాంతంలో నివాసముండే బాధితుడు ఫేస్బుక్ చూస్తుండగా ట్రేడింగ్‌కు సంబంధించిన లింక్ కన్పించింది. దానిని క్లిక్ చేయడంతోనే వాట్సాప్ గ్రూప్‌నకు నంబర్ యాడ్ అయ్యింది.
ఆ గ్రూప్‌లో స్టాక్స్‌కు సంబంధించిన సమాచారం, పెట్టుబడులు పెడితే లాభాలకు సంబంధించిన అంశాలపై మెలుకువలు చెబుతున్నారు. ఆ గ్రూప్‌లో జరుగుతున్న చర్చను చూసి నిజమని నమ్మాడు. రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ పీఎంఏ పేరుతో అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేయించి అందులో ట్రేడింగ్ ఖాతాను తెరిపించారు. ఆ తరువాత వాట్సాప్‌లో ఆర్సీఎల్ స్టాక్ విజన్ పేరుతో మరో గ్రూప్‌ను తయారు చేసి అడ్వయిజర్లు ఫోన్లు మాట్లాడుతూ స్టాక్స్‌లో పెట్టుబడికి సూచనలు చేశారు. మొదట రూ. 2 లక్షలతో ప్రారంభించిన పెట్టుబడికి కొంత లాభం చూపించారు.
ఆ తరువాత దఫ దఫాలుగా పెట్టుబడి పెడుతూ వెళ్లాడు. ఐపీఓలకు పెట్టుబడి లేకుంటే లోన్ ఇప్పించి ఎక్కువ మొత్తంలో స్టాక్స్ మీకు కేటాయిస్తామంటూ నమ్మించారు. ఇలా పెట్టుబడి పెడుతూ వెళ్తుండడంతో స్క్రీన్‌పై రూ. 2.17 కోట్లు కన్పించాయి. వాటిని విత్ డ్రా చేసుకోవాలంటే 15 శాతం బ్రోకరేజ్ ఫీజు చెల్లించాలంటూ షరతులు విధించారు.
అందులో మినహాయించుకొని తమ డబ్బు తమకు ఇవ్వాలంటే అది కుదరదని తప్పని సరిగా ఆ డబ్బు చెల్లించాలంటూ సూచించారు. అప్పటికే రూ. 73.16 లక్షలు పెట్టుబడి పెట్టిన బాధితుడిని మరింత పెట్టుబడి పెట్టాలని, తమ ఖాతాలో ఉన్న డబ్బును విత్ డ్రా చేసుకోవాలంటే కమిషన్ చెల్లించాలంటూ షరతులు విధిస్తుండడంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు రాచకొండ సైబర్‌క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.