సిటీబ్యూరో, జూలై 16 (నమస్తే తెలంగాణ): ఉద్యోగాల పేరుతో అమాయకులను మోసం చేస్తున్న ఏపీకి చెందిన సైబర్‌నేరగాడిని సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్‌క్రైమ్స్ ఏసీపీ రవీందర్‌రెడ్డి కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లాకు చెందిన కీలారు సీతయ్య వృత్తిరీత్యా వ్యాపారి. తనకు తానుగా ఎరిక్సన్ గ్లోబల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో సీనియర్ ఎంప్లాయీనంటూ చెప్పుకున్నాడు. నౌకరీ, లింక్డిన్ వెబ్సైట్ల నుంచి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారి డేటాను సేకరిస్తాడు. వాళ్లకు ఫోన్ చేసి నేను ఫలానా కంపెనీలో పనిచేస్తున్నాను, అందులో ఉద్యోగం కావాలంటే మీకు ఇప్పిస్తాను.. కానీ కొంత ఖర్చవుతుందని నమ్మిస్తాడు.
ఇతని మాటలు నమ్మి బాధితులు ముందుగా కొంత అడ్వాన్స్ ఇవ్వగానే ఫేక్ ఇంటర్వ్యూ నిర్వహించి, ఆ తరువాత ఫేక్ అపాయింట్మెంట్ లెటర్ పంపించి ఉద్యోగానికి ఎంపికయ్యావని మొత్తం డబ్బులు వసూలు చేస్తాడు. ఇలా పలువురికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి బాధితుల నుంచి రూ. 5.64 లక్షలు వసూలు చేశాడు. మోసపోయిన బాధితులు సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై సైబరాబాద్‌లో ఆరు, హైదరాబాద్‌లో ఒక కేసు నమోదైంది.