బడంగ్‌పేట, డిసెంబర్ 22 : చెరువులు, కుంటలను కూలదీస్తున్నారు. చెరువు, కుంటలపై రియల్టర్ల కన్ను పడింది. రెవెన్యూ, నీటి పారుదల అధికారుల కండ్లు గప్పి చెరువులను రాత్రికి రాత్రే మట్టి, పెద్దపెద్ద బండరాళ్లతో పూడ్చివేస్తున్నారు. రోజురోజుకు కుంట ఆనవాళ్లు లేకుండా చేయడానికి ఆక్రమణదారులు కంకణం కట్టుకున్నారు. బాలాపూర్ మండల పరిధిలోని మల్లాపూర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 23లో ఉన్న సుద్దమోని కుంట ఆక్రమణకు గురవుతున్నది. సుద్దమోని కుంట ఎక్కడో లేదు ఆర్సీఐ ప్రధాన రహదారిపై ఉన్నది. ఉన్నతాధికారులు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు నిత్యం ఇదే దారిపై వెళ్తున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. సుద్దమోని కుంటను కాపాడాలని స్థానిక కార్పొరేటర్ మనోహర్ ఇప్పటికే రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదులు చేశారు. అయినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు.
చెరువును సుందరీకరణ గత కేసీఆర్ ప్రభుత్వం కోటి రూపాయల నిధులు మంజూరు చేసింది. సుందరీకరణ పనులు చేయకుండా కొంత మంది స్థానిక నాయకులే కారణమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. చెరువును పూడ్చి వేస్తే భూగర్భ జలాలు పూర్తిగా పాతాలంలోకి పడిపోయో ప్రమాదం ఉందని, కుంటలో నీళ్లు ఉండటం వల్లనే బోర్లలో నీళ్లు ఉన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని స్థానిక కార్పొరేటర్ ఫిర్యాదు చేసినా అధికారుల్లో చలనం లేకుండా పోయిందని స్థానికులు మండి పడుతున్నారు. చెరువు పక్కల భూమి ఉన్న వారి సహకారంతో ఈ తతంగం జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మంజూరైన కోటి రూపాయలతో సుందరీకరణ పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరిస్తున్నారు.
మల్లాపూర్ రెవెన్యూ పరిధిలో ఉన్న సుద్దమోని కుంటలో మట్టి పోసి కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం. చెరువును పరిశీలించాలని ఆర్ఐకి చెప్పగా.. ఆర్ఐ చెరువును పరిశీలించి మట్టి పోస్తున్నట్లు వివరించారు. సంబంధిత ఇరిగేషన్ అధికారులకు నోటీస్ పంపించాం. చెరువులో మట్టి పోస్తున్న లారీలను సీజ్ చేయిస్తాం. కబ్జాదారులపై కేసులు నమోదు చేయిస్తాం. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడానికి చొరవ తీసుకుంటాం. ప్రభుత్వ భూముల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయిస్తున్నాం.
– మాధవి రెడ్డి, తాసీల్దార్