e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Home హైదరాబాద్‌ వానలకు విరామం.. పనులు వేగిరం

వానలకు విరామం.. పనులు వేగిరం

  • గ్రేటర్‌వ్యాప్తంగా సీఆర్‌ఎంపీ పనులు ముమ్మరం
  • వానలు తగ్గుముఖంతో వేగవంతం
  • రెండోవిడుతలో 208.7 కి.మీ. ఆధునీకరణ
  • వచ్చే మార్చి నాటికి పూర్తి చేసే లక్ష్యం
  • ఏప్రిల్‌ నుంచి మూడోవిడుత పనులు ప్రారంభం

గ్రేటర్‌లో సులభతర ప్రయాణానికి జీహెచ్‌ఎంసీ ప్రారంభించిన కాంప్రహెన్సివ్‌ రోడ్‌ మెయింటెనెన్స్‌ ప్రొగ్రాం (సీఆర్‌ఎంపీ) సత్ఫలితాలిస్తోంది. మొత్తం 709 కి.మీ. మార్గాన్ని ఆధునీకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, మొదటి విడుతలో 330 కి.మీ. మేర పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం వానలు తగ్గుముఖం పట్టడంతో రెండోవిడుత పనులను పట్టాలెక్కించేందుకు ఆయా ఏజెన్సీలు సమాయత్తమవుతున్నాయి. ఈ విడుతలో 208 కి.మీ. పనులు చేయాల్సి ఉండగా, ఇప్పటికే 120 కి.మీ పూర్తయ్యింది. మిగిలిన భాగాన్ని వచ్చే మార్చిలోపు పూర్తి చేయాలని బల్దియా భావిస్తున్నది. వర్షాలకు దెబ్బతిన్న చోట ఎప్పటికప్పుడు మరమ్మతు చేస్తున్నారు.

నైరుతి రుతుపవనాల తిరోగమనంతో గ్రేటర్‌వ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. వానలు లేకపోవడంతో రహదారుల నిర్వహణపై జీహెచ్‌ఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. జూన్‌ నుంచి వర్షాల నేపథ్యంలో రహదారుల ఆధునీకరణ పనుల్లో జాప్యం జరిగింది. ప్రస్తుతం వానలు వచ్చే అవకాశం లేకపోవడంతో నిర్దేశిత లక్ష్యం లోపు సీఆర్‌ఎంపీ పనులు పూర్తి చేయాలన్న కమిషనర్‌ ఆదేశాల మేరకు ఆయా ఏజెన్సీలు చర్యలు ముమ్మరం చేశాయి.

- Advertisement -

సమగ్ర రోడ్ల నిర్వహణ కార్యక్రమం (సీఆర్‌ఎంపీ) కింద సుమారు రూ.1839 కోట్లతో 401 విభాగాలుగా పనులను విభజించారు. మొత్తం 709 కిలోమీటర్ల మేర రహదారులను ఆధునీకరించేందుకు జోన్ల వారీగా కాంట్రాక్ట్‌ ఏజెన్సీలకు పనులు అప్పగించారు. ఇందులో భాగంగా తొలివిడుత (2019-20)లో ఏడు ప్యాకేజీలుగా విభజించి 329.9 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేశారు. రెండో విడుతలో 2020-21 సంవత్సరానికి గానూ 208.7 కిలోమీటర్లకు శ్రీకారం చుట్టగా ప్రస్తుతం 120 కిలోమీటర్ల పనులను పూర్తి చేశారు. పెండింగ్‌లో ఉన్న 45 శాతం పనులు వచ్చే మార్చి నాటికి పూర్తిచేసి ఎక్కడా గుంతలు లేకుండా సాఫీ ప్రయాణమే లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ చర్యలు చేపడుతుంది. మార్చిలో ఈ పనులు పూర్తయితే ఏప్రిల్‌లో మూడోవిడుత పనులు ప్రారంభించేందుకు కార్యాచరణ రూపొందించింది.

సీఆర్‌ఎంపీ పురోగతి ఇలా..

సీఆర్‌ఎంపీ పనులు – 401 ప్రాంతాలు
చేయాల్సిన పనులు – 709 కి.మీ
తొలివిడుతలో పూర్తి చేసినవి – 329.9 కి.మీ.
రెండోవిడుతలో చేయాల్సింది – 208.7 కి.మీ.
ఇప్పటివరకు పూర్తయ్యింది – 120 కి.మీ.
ఖర్చు చేసిన మొత్తం వ్యయం – రూ.546.42కోట్లు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement