Industrial Park | మేడ్చల్, ఏప్రిల్ 25(నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా మాదారంలోని ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు పనులు ప్రారంభంలో జాప్యంపై విమర్శలు వస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాదారంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు 3 వందల ఎకరాలను రూ. 60 కోట్లు వెచ్చించి భూ సేకరణ చేసి టీఎస్ఐఐసీకి అప్పటి ప్రభుత్వం అప్పగించింది. అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్‌కు సంబంధించిన పనులను ప్రారంభించడం లేదు.
టీఎస్ఐఐసీకి భూమిని అప్పగించడంతో నామమాత్రంగా 255 పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు లే అవుట్ మ్యాప్‌ను తయారు చేశారే తప్ప.. తప్ప ఇండస్ట్రియల్ పార్క్‌లో ఎలాంటి పనులు ప్రారంభించడం లేదు. మాదారంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటైతే సుమారు 255 చిన్న, మధ్య, భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. దీంతో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. టీఎస్ఐఐసీకి భూములు అప్పగించినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పనులు ప్రారంభించడం లేదు. ఇప్పటికే మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అనేకంగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు వేలాది సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.