సోమవారం 30 నవంబర్ 2020
Hyderabad - Oct 22, 2020 , 08:41:04

క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్లు అరెస్ట్‌

క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్లు అరెస్ట్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : రెండు వేర్వేరు చోట్ల క్రికెట్‌ బెట్టింగ్‌ ఆడుతున్న 8మందిని సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు కథనం ప్రకారం.. ముషీరాబాద్‌కు చెందిన సదాశివ అలియాస్‌ శ్రీను, నీల శ్రీనివాస్‌లు ముషీరాబాద్‌లోని పర్శిగుట్టలో ఒక ఇంట్లో క్రికెట్‌ లైవ్‌ చూస్తూ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ స మాచారంతో సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ జావెద్‌ బృందం దాడి చేసి నిర్వాహకులతో పాటు దుద్దుడుక చంద్రయ్య, మెరుగు సంపత్‌కుమార్‌ అనే ఫంటర్లను అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి రూ.39600 నగదు, ఇతర బెట్టింగ్‌ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు తదుపరి విచారణకు చిలకలగూడ పోలీసులకు అప్పగించారు. 

మరో ఘటనలో... గాంధీనగర్‌, ఎస్‌బీఐకాలనీకి చెందిన నర్వ రామకృష్ణ భవన నిర్మాణదారుడు. కాగా తన ఇంట్లోనే పెంట్‌హౌస్‌పై ముషీరాబాద్‌కు చెందిన ఉదత అరుణ్‌యాదవ్‌, యాదరం నాగేందర్‌, పుట్ట దిలీప్‌ కుమార్‌లతో కలిసి ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. రామకృష్ణ డైమాండ్‌ఎక్స్‌.కామ్‌ వెబ్‌సైట్‌తో ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు స్కోర్‌ తెలుసుకుంటూ ఈ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నాడు. బుకీలైన ఉప్పుగూడకు చెందిన బాలకృష్ణ రావు, బేగంబజార్‌కు చెందిన సంజు, ముషీరాబాద్‌కు చెంది దాత్రిక్‌ శివకుమార్‌లకు ఈ బెట్టింగ్‌ నగదును అందజేస్తున్నాడు. ఈ ముగ్గురు బూకీలు పరారీలో ఉన్నారు. బెట్టింగ్‌ నిర్వాహకుడితో పాటు ఆడుతున్న మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని వారి వద్దనుంచి రూ.25500 నగదు, క్రికెట్‌ బెట్టింగ్‌ సామగ్రిని స్వాధీనం చేసుకొని తదుపరి విచారణకు గాంధీనగర్‌ పోలీసులకు అప్పగించారు.

బెట్టింగ్‌ నిర్వహిస్తూ మహిళ.. 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : క్రికెట్‌ బెట్టింగ్‌లో భర్త ఆదేశాలతో మరిదితో కలిసి బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఓ మహిళ వెస్ట్‌జోన్‌ పోలీసులకు పట్టుబడింది. ఇప్పటి వరకు క్రికెట్‌ బెట్టింగ్‌లో ఎక్కువగా మగవారే పట్టుబడుతూ వస్తున్నారు. తాజాగా ఓ మహిళ పట్టుబడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు కథనం ప్రకారం.. మంగళ్‌హాట్‌ పూసలబస్తీకి చెందిన ధరమ్‌సింగ్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహించడంలో అరితేరాడు. ఇందులో అతని భార్య సుమన్‌ లత, అతనికి సోదరుడి వరుస అయ్యే రాహుల్‌సింగ్‌కు నెలకు రూ.20 వేల జీతం ఇస్తూ క్రికెట్‌ బెట్టింగ్‌లోకి తీసుకున్నాడు. ప్రస్తుతం నడుస్తున్న ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ బెట్టింగ్‌లను పూసలబస్తీలోని వారి ఇంట్లో నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ గట్టుమల్లు బృందం ఆ ఇంటిపై దాడి చేయడంతో బెట్టింగ్‌ నిర్వహిస్తున్న లత, రాహుల్‌లు పట్టుబడ్డారు. ప్రధాన నిర్వాహకుడు ధరమ్‌సింగ్‌ పరారీలో ఉన్నాడు. ఈ మేరకు ఇద్దరిని అరెస్ట్‌ చేసి వారి నుంచి రూ.27080 నగదు, బెట్టింగ్‌ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కేసు తదుపరి విచారణ నిమిత్తం మంగళ్‌హాట్‌ పోలీసులకు అప్పగించారు.