శేరిలింగంపల్లి, నవంబర్ 2 : టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లపై బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న ముఠాను మాదాపూర్ ఎస్ఓటీ, గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి 36.5 లక్షల విలువజేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన బుకీలు ముగ్గురు పరారీలో ఉన్నారు. గచ్చిబౌలి డీసీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదాపూర్ డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర (పూణే)కు చెందిన కాశీప్ ఉమెర్ అలియాస్ కాశీప్ అన్సారీ నగరంలోని ధూల్‌పేట్ మంగళ్‌హట్ ప్రాంతానికి చెందిన చంద్రపాల్ అలియాస్ పాల్, అజార్ అలియాస్ అజ్జులు ప్రధాన బుకీలుగా వ్యవహరిస్తున్నారు.
మంగళ్ఘట్ ప్రాంతానికి చెందిన ధరమ్‌సింగ్(44), సీతారాంబాగ్‌కు చెందిన అశీష్ కాలియా(36), జుమ్మెరత్బజార్కు చెందిన మనోజ్‌కుమార్(42), యోగేశ్ సింగ్ (22), అఘాపురాకు చెందిన అరుణ్‌కుమార్ శర్మ(41), ధూల్‌పేట్‌కు చెందిన మహేందర్ సింగ్ (34), రాజాస్థాన్ జైపూర్‌కు చెందిన కమల్‌కుమార్ మీనా(32) ముఠాగా ఏర్పడి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం గచ్చిబౌలి టీఎన్జీవోస్ కాలనీలోని విహంగ్ కో లీవింగ్ పీజీ హాస్టల్లో గదిని (నం.204) రోజుకు రూ.800చొప్పున నెలరోజుల పాటు అద్దెకు తీసుకున్నారు.
లీవ్, లైన్ గురూ, క్రికెట్ బజ్, క్రికెట్ మజా యాప్‌ల ద్వారా టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా సోమవారం రాత్రి ఇంగ్లాండ్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌పై బెట్టింగ్ నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు మాదాపూర్ ఎస్ఓటీ, గచ్చిబౌలి పోలీసులు రాత్రి 10:30 గంటల ప్రాంతంలో హాస్టల్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న గదిపై దాడిచేశారు. ధరమ్‌సింగ్, అశీష్ కాలియా, మనోజ్‌కుమార్, యోగేశ్ సింగ్, అరుణ్‌కుమార్ శర్మ, కమల్ కుమార్ మీనా, మహేందర్ సింగ్‌లను అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి రూ.15.10 లక్షల నగదుతో పాటు 11స్మార్ట్ ఫోన్లు, 3 ల్యాప్‌టాప్‌లు, రాయల్ ఇన్ఫీల్డ్ బైక్, కియా కారు, సుజుకీ జూపిటర్ వాహనం, బెట్టింగ్ నిర్వహించే కమ్యూనికేటర్ బోర్డు మొత్తం 36.50 లక్షల విలువజేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇదివరకు బెట్టింగ్‌లకు పాల్పడినట్లు తేలితే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.
తల్లిదండ్రులు పిల్లలపై దృష్టిపెట్టాలని డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. లీవ్, లైన్ గురూ, క్రికెట్ బజ్, క్రికెట్ మజా యాప్‌ల ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని అయితే వాటిని నిలిపివేయాలని గూగుల్‌కు సైతం లేఖ రాస్తామని చెప్పారు. ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడినట్లు తెలిస్తే.. 94906 17444కు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు, ఎస్ఓటీ సీఐ శివకుమార్, గచ్చిబౌలి సీఐ సురేశ్, ఎస్ఓటీ ఎస్ఐ విజయవర్ధన్, సిబ్బంది పాల్గొన్నారు.