ప్లాటు, అపార్ట్మెంట్ ఫ్లాట్, ఇల్లు, విల్లా.. ఏది కొనాలన్నా పడే ఇబ్బందులు తెలియని కావు. ప్రాజెక్టు వివరాలు తెలుసుకునేందుకే రోజులు గడిచిపోతాయి. ఈ ఇక్కట్లను తప్పించేలా, అన్ని ప్రాజెక్టుల వివరాలు సమగ్రంగా తెలియజేసేందుకు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలన్నీ ఒకేచోట కొలువుదీరాయి. మాదాపూర్ హైటెక్స్ ప్రాంగణంలో మూడురోజులపాటు జరిగే క్రెడాయ్ ప్రాపర్టీ షో శుక్రవారం ప్రారంభమైంది. ప్రముఖ దిగ్గజ నిర్మాణ సంస్థలు తాము చేపట్టబోయే ప్రాజెక్టుల వివరాలను నేరుగా, వీడియోల ద్వారా వివరించాయి. ఈ ప్రదర్శనలో నచ్చిన ప్రాజెక్టుల్లో కొనుగోలు చేసే ఇంటికి వెంటనే రుణాలిచ్చేందుకు పలు బ్యాంకులు కౌంటర్లు ఏర్పాటు చేశాయి.
ప్రాపరీ ్టషోలో పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నాయి. తమ ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర సమాచారం కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే స్మార్ట్ ఫోన్లోనే అన్ని వివరాలు తెలిసేలా అవకాశం కల్పించారు. డ్రోన్ కెమెరాలతో తీసిన వీడియోలను ప్రదర్శిస్తున్నారు.
శుక్రవారం ప్రారంభమైన స్థిరాస్తి ప్రదర్శన శని, ఆదివారాల్లో కూడా కొనసాగనుంది. వరుస సెలవులు కావడంతో వేలాదిమంది సందర్శకులు వచ్చే అవకాశం ఉంది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సందర్శకులను లోపలికి అనుమతిస్తున్నారు. అపర్ణ, మైహోం, వాసవి, సుమధుర, రాజపుష్ప, ఎస్ఎంఆర్, ఆర్వీ నిర్మాణ్..ఇలా వందకు పైగా కంపెనీలు స్టాళ్లు ఏర్పాటు చేశాయి.