CREDAI | మాదాపూర్, ఆగస్టు 2: దేశంలోనే హైదారాబాద్ బెస్ట్ నగరమని క్రెడాయ్ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి అన్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో -2024కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సభ్యులతో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ .. రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, ఆవిష్కరణలను పెంపొందించేందుకు క్రెడాయ్ హైదరాబాద్ ఎంతగానో కృషి చేస్తున్నదన్నారు. ఈ నెల 1న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో జరిగిన సమావేశంలో నిర్మాణ రంగం, తెలంగాణ అభివృద్ధి, 2050 వరకు ప్రభుత్వ ఆలోచనలను ఏ విధంగా పరిగణలోకి తీసుకొని అభివృద్ధి చేయాలనే విషయమై చర్చించినట్లు చెప్పారు.
హైదరాబాద్‌ను టూరిజం, హెల్త్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో రేవంత్ ప్రభుత్వం ఉందన్నారు. సామాన్యుల కల సొంత ఇంటితో నెరవేరుతుందని, సామాన్యులను సైతం దృష్టిలో ఉంచుకొని వారికి అందుబాటు ధరలో నిర్మాణాలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రగతిలో క్రెడాయ్ భాగస్వామ్యమవుతుందన్నారు. ఓఆర్ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్‌గా ప్రభుత్వం గుర్తించిందని, బడ్జెట్లో రూ. 10 వేల కోట్లు కేటాయించిందని, ఈ ప్రాంతం వేగవంతంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఏర్పడుతుందని చెప్పారు.
రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే కీలకమైన ప్రాంతీయ రింగ్ రోడ్డు డెవలప్మెంట్ కోసం రూ. 1525 కోట్లు, మెట్రో వాటర్‌వర్క్స్ రూ. 3385 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌కు రూ.500 కోట్లు, ఓల్డ్ సిటీ మెట్రో పొడిగింపునకు రూ. 500 కోట్లు, మల్టీ మోడల్ రవాణా వ్యవస్థ కోసం రూ. 50 కోట్ల నిధులను కేటాయించినట్లు తెలిపారు. ఐజీబీసీ చైర్మన్ శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ . ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు కోసం రూ. 200 కోట్ల బడ్జెట్లో కేటాయించడంతో సీయూఆర్ కవర్ చేయడంతో పాటు ఈ ప్రాంతంలో విపత్తు నిర్వహణ కోసం ఒక సమీకృత యూనిట్‌గా పనిచేస్తుందన్నారు. కంటోన్మెంట్ ప్రాంతంలో రహదారి విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం రక్షణ మంత్రిత్వ శాఖను సంప్రదించి, రక్షణ భూమి బదిలీకి ఆమోదం పొందేందుకు చేసిన కృషికి ప్రభుత్వాన్ని అభినందిస్తున్నామన్నారు.