జవహర్‌నగర్, మార్చి 12: పేదల స్థలంపై ఓ కార్పొరేటర్ జులుం ప్రదర్శించాడు. ఏకంగా తప్పుడు నోటరీ పత్రాలు సృష్టించి, విద్యుత్ మీటర్‌ను సైతం మార్చేశాడు. ఈ ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధి బీజేఆర్ నగర్లో చోటు చేసుకుంది. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం… జవహర్‌నగర్‌కు చెందిన వడ్లకొండ రాజు 2015లో 200 గజాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. ఆ ప్లాటులో అదనపు గదులు నిర్మించేందుకు రాజు ఏర్పాట్లు చేస్తుండగా.. స్థానిక కార్పొరేటర్ ఆ స్థలం వద్దకు రావొద్దంటూ బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల ఆ ప్లాట్‌ను స్థానిక కార్పొరేటర్ పల్లపు రవి తన అనుచరులతో కలిసి కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నాడని తెలిపారు. ఇంటికి ఉన్న పాత మీటర్‌ను తొలగించి, అక్రమ మార్గంలో కొత్త మీటర్‌ను తీసుకొచ్చి, ఆ రూమ్‌కి పెట్టి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, స్థలం కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, న్యాయం చేయాలని బాధితుడు పోలీసులను వేడుకున్నాడు.