సిటీబ్యూరో/ముషీరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): పురాతనమైన అశోక్‌నగర్ వంతెన విస్తరణ పనులను త్వరలో చేపట్టనున్నారు. ఇందుకోసం అధికారులు రూ. 2 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 1979లో నిర్మించిన ఈ పురాతన బ్రిడ్జికి పగుళ్లు ఏర్పడగా.. మరమ్మతులకు ఏమాత్రం అవకాశం లేకపోవడంతో కూల్చివేసి తక్షణమే కొత్త బ్రిడ్జిని నిర్మించాలని సర్వేలో తేల్చారు.
ఈ మేరకు త్వరలో టెండర్ ప్రక్రియను చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసుల నుంచి ముందస్తు అనుమతి కోరారు. కాగా అశోక్‌నగర్ వద్ద హుస్సేన్‌సాగర్ నాలాపై ప్రస్తుతం నాలుగు వంతెనలు ఉన్నాయి. రెండు పాతవి కాగా మరో రెండింటిని ఇటీవల కొత్తగా నిర్మించారు. నాలుగు లైన్ల రోడ్డు కోసం రెండు పాత వంతెనలతో పాటు మరో రెండు వంతెనలు నిర్మించారు. పైన స్టీలు బ్రిడ్జి, కింద నాలుగు వంతెనలు.. అంతా బాగుందనుకుంటున్న సమయంలో పాత వంతెనకు పగుళ్ళు ఏర్పడటంతో వాటిని తొలగించి కొత్తగా నిర్మించాలని నిర్ణయించారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్డు-ఇందిరాపార్కు- ట్యాంక్‌బండ్ మార్గంలో ఉన్న అశోక్ నగర్ వంతెన వద్ద నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్నది. ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి ఇందిరాపార్కు, ట్యాంక్‌బండ్ వరకు డివైడర్‌తో కూడిన విశాలమై రోడ్డు ఉండగా కేవలం అశోక్‌నగర్ వంతెన వద్ద మాత్రమే రోడ్డు ఇరుకుగా ఉండటమే ఈ సమస్యకు కారణంగా తెలుస్తున్నది. రెండు వైపులా నిత్యం పెద్ద ఎత్తున వాహనాల రాకపోకలు సాగుతుండగా ఇక్కడి బ్రిడ్జి వద్దకు రాగానే అతితక్కువ వేగంతో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో రెండు వైపులా నిత్యం ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తుతుంది.