కాప్రా, మే 25:ఎర్రకోటపై జెండా ఎగురవేయడమే లక్ష్యంగా వామపక్షపార్టీలన్నీ ఏకమై ముందుకు సాగాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపు ఇచ్చారు. ఈసీఐఎల్ సమీపంలోని బంజారా ఫంక్షన్‌హాలులో సీపీఐ సహాయ కార్యదర్శి జి.దామోదర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సీపీఐ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా 4వ మహాసభకు కూనంనేని ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. వందేండ్ల కాలంగా కార్మిక, కర్షక, నిరుపేదల పక్షాన పోరాడుతన్న ఘనత కమ్యూనిస్టులకే మాత్రమే దక్కిందన్నారు. కార్పొరేట్ శక్తులకు దాసోహమై ఇతర వర్గాలను అణచివేసేలా పాలన కొనసాగిస్తున్న బీజేపీని అంతం చేయాల్సిందేనన్నారు.
మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రశ్నించారు. చర్చలకు సిద్ధమని వారు ప్రకటిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశంలోని వామపక్ష, లౌకికశక్తులు ఏకం కావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అర్హులకు దక్కేలా సీపీఐ శ్రేణులు పోరాడాలన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ అన్నివర్గాలను సమీకృతం చేస్తూ ముందుకు వెళ్లే సత్తా సీపీఐకి మాత్రమే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు వీ.ఎస్.బోస్, ఏఐటీయుసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసుఫ్, సీపీఐ నేతలు పాల్గొన్నారు.