కుత్బుల్లాపూర్, ఆగస్టు 20: రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రశ్నార్థ్ధకంగా మార్చిన బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు లౌకిక శక్తులు ఏకం కావాలని సీపీఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా పిలుపునిచ్చారు. ఆ పార్టీ రాష్ట్ర 4వ మహాసభలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్‌నగర్ పొట్లూరి నాగేశ్వర్రావునగర్ భవన్లో బుధవారం అట్టహసంగా ప్రారంభమయ్యాయి. అనంతరం మహారాజా గార్డెన్లో జరిగిన సభలో ముఖ్యఅతిథిగా హజరైన ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజా మాట్లాడుతూ.. దేశంలో ప్రస్తుతం రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ప్రశ్నార్ధకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
అర్హులైన ప్రతి ఒక్క వయోజనులకు ఓటుహక్కును కల్పించేలా చూడాల్సిన భారత ఎన్నికల సంఘం తటస్థంగా పనిచేయడం లేదన్నారు. అందుకే బీహర్‌లో ఓటుహక్కు కోసం పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభమైందన్నారు. దీనంతటికి కారణమైన బీజేపీ, ప్రధానమంత్రి మోదీని గద్దె దించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డికి సీపీఐ మద్దతు తెలుపుతోందన్నారు.
ఈ సభలో సీపీఐ జాతీయ కార్యదర్శులు డా.కే నారాయణ, రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, సయ్యద్ అజీమ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, పశ్య పద్మ, వెంకటరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాసరావు, సత్యం, చంద్రశేఖర్‌రావు, సౌహర్ధ, యూసుఫ్‌తో పాటు జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండలాల కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.