హైదరాబాద్: ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం వ్యాయామం చేయాలని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి (CP Srinivas Reddy) అన్నారు. కరోనా తర్వాత ఆరోగ్యంపై ప్రజలు ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారని చెప్పారు. 60, 70 ఏండ్లలో వచ్చే వ్యాధులు ఇప్పటి నుంచే యువత ఎదుర్కొంటున్నారన్నారు. హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు నిర్వహిస్తున్న ఎన్ఎండీసీ మారథాన్ (Hyderabad Marathon) 13వ ఎడిషన్ను జెండా ఊపి సీపీ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. ఏటా నిర్వహిస్తున్న ఈ మారథాన్ ఫిట్నెస్పై అవగాహనను పెంచేందుకు దోహదం చేస్తుందన్నారు. దేశంలోనే అతిపెద్ద రెండో మారథాన్ ఇదని చెప్పారు.
మారథాన్లో వివిధ దేశాల రన్నర్లు పాల్గొన్నారని తెలిరు.
మారథాన్ నేపథ్యంలో హైదరాబాద్లో ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. ఫుల్ మారథాన్ (42 కి.మీ.) పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారభమై జూబ్లీహిల్స్, రోడ్ నంబర్ 45, కేబుల్ బ్రిడ్జి, ఐటీసీ కోహినూర్, నాలెడ్జ్ సిటీ, మైహోం అబ్రా, ఐకియా రోటరీ, ట్రాన్స్కో, బయోడైవర్సిటీ జంక్షన్, టెలికాంనగర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, ఇందిరానగర్, ట్రిపుల్ ఐటీ జంక్షన్, గచ్చిబౌలి స్టేడియం, హెచ్సీయూ క్యాంపస్ గేట్ నంబర్ 2 నుంచి తిరిగి గచ్చిబౌలి స్టేడియం వద్ద ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయా రూట్లలో వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.